
నల్గొండ, వెలుగు : ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవం సందర్భంగా, డ్రగ్స్ కంట్రోల్ పరిపాలన, వైద్యారోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను దారి తప్పిస్తున్న డ్రగ్స్ వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మకూడదని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా విద్యార్థులు, డ్రగ్ లైసెన్స్ హోల్డర్లు పాల్గొని నకిలీ మందుల నియంత్రణ, యాంటీబయాటిక్ నిరోధకతపై అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఏఎస్పీ రమేశ్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు