Reading Time: 2 minutes

ఖమ్మం జిల్లా రాపల్లిలో రైలుకింద పడి ఆత్మహత్య

చేసుకున్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అక్షాంత్

అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ అయినట్లు ఫలితాల్లో వెల్లడి

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/మహబూబ్‌నగర్ బ్యూరో/ వెల్దుర్తి/ ఉట్నూర్: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయపడి నాలుగు రోజుల క్రితం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, ఆదివారం వెల్లడైన ఇంటర్ ఫలితాలలో మాత్రం ఆ విద్యార్థి పాసయ్యాడు. బోనకల్ మండలం రాపల్లికి చెందిన గంగాదేవుళ్ల వెంకటేశ్వర్లు రేణుక కుమారుడు గంగాదేవుల అక్షాంత్ వైరా పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని, ఫెయిల్ అవుతానేమోననే భయంతో గురువారం మధిర రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆదివారం వెలువడ్డ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అక్షాంత్ 347 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. ఇది తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఫలితాలపై విద్యార్థులు ఆందోళన చెందకుండా, కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు వారికి మానసికంగా ధైర్యం చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవితం ఒక పరీక్షా ఫలితంతో ముగియదని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ఎందరో గొప్ప వ్యక్తులు చదువులో విఫలమైనా, జీవితంలో అద్భుత విజయాలు సాధించారని నిపుణులు పేర్కొంటున్నారు.

అన్నాసాగర్‌లో విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానన్న బాధతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో చోటుచేసుకున్నది. జక్కుల శ్రావణి (17) అనే విద్యార్థిని భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివి పరీక్షలు రాసింది. ఆదివారం విడుదలైన ఫలితాలలో శ్రావణి ఫెయిల్ అయింది. దీంతో మానసిక వేదన చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

వెల్దుర్తిలో విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అ య్యాడనే మనస్థాపం తో చాకలి సాయిరాం (17) అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. వివరాల్లోకి వెళితే… చాకలి సాయిలు నాగమణి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి పని చేసుకునే తరుణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో సా యిరాం ఇంటర్‌లో సీఈసీ చదువు తున్నాడు. ఈ నెలలో సోదరి మహేశ్వరి వివాహం కుదరడంతో కుటుం బసమేతంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ తరుణంలో ఆదివారం నాడు వెలువడిన పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మనస్థాపానికి గురైన సాయిరాం ఇంట్లో ఎవరూ లేని సమయం లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.

దంతన్‌పల్లిలో ఉరివేసుకొని..

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లికి చెందిన జిల్లపెల్లి బక్కన్న, బుచ్చవ్వ దంపతుల కుమార్తె సౌజన్య (17) ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల కాగా ఆ ఫలితాలలో సౌజన్య ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.