
నింగ్బో (చైనా): ఇండియా యంగ్ షట్లర్ ఆయుష్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్ 25వ ర్యాంకర్ ఆయుష్ 10–21, 21–19, 21–17తో వరల్డ్ నంబర్ వన్, వరల్డ్ చాంపియన్ కున్లావుత్ విటిడ్‌సర్న్ (థాయ్‌లాండ్)కు షాకిచ్చి టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లాడు. దాంతో 60 ఏండ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్ చేరిన ఇండియా సింగిల్స్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
1965లో మెన్స్ సింగిల్స్‌లో గోల్డ్ నెగ్గిన ఏకైక ఇండియన్‌గా దినేశ్ ఖన్నా నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 2023లో సాత్విక్–చిరాగ్ జోడీ డబుల్స్‌లో స్వర్ణం గెలవగా, ఆయుష్ ఇప్పుడు టైటిల్ ముంగిట నిలిచాడు. 75 నిమిషాల పాటు జరిగిన సెమీస్ పోరులో తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాతి రెండు గేమ్‌ల్లో ఆయుష్ అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ విజయంతో ఆయుష్‌కు రజతం ఖాయమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో అతను రెండో సీడ్ చైనా స్టార్ ప్లేయర్ షి యుకితో అమీతుమీ తేల్చుకోనున్నాడు.