
ముందుగా తుది కేబినెట్ భేటీ . కొత్త సిఎం సామ్రాట్?
పాట్నా: తూర్పు మధ్య ప్రాంత కీలక రాష్ట్రం బీహార్ ఉన్నత స్థాయి రాజకీయ మార్పు దశకు చేరుకుంది. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ నెల 14 (మంగళవారం) సిఎం పదవికి రాజీనామా చేస్తారు. అంతకు ముందు అదే రోజు ఆయన తమ సారధ్యపు కేబినెట్ చివరి సమావేశంలో పాల్గొంటారు. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఆదివారం బీహార్ రాజకీయాల్లో కదలిక ఏర్పడింది. తుది కేబినెట్ భేటీ తరువాత జెడియు నేత అయిన నితీష్ ప్రభుత్వ పగ్గాలు వదులుకుంటారు. బిజెపి సారద్య ప్రభుత్వానికి వీలు కల్పిస్తారు. కేబినెట్ సెక్రెటేరియల్ వెలువరించిన నోటిఫికేషన్ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఇందులో నితీష్ తమ సహచరులకు సందేశం వెలువరిస్తారు. తరువాత గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్‌కు రాజీనామా సమర్పిస్తారు. సోమవారం తరువాత రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆరంభం అవుతుందని అంతకు ముందు కుమార్ అత్యంత సన్నిహితులు , జెడియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సంజయ్ కుమార్ ఝా విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఈసారి బిజెపి తరఫున సీనియర్ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దీనితో రాష్ట్రంలో తొలిసారి బిజెపి రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుంది. ఈ అపూర్వ ఘట్టం నెలకొనడానికి ముందు పలు అవరోధాలు, జెడియు నుంచి గణనీయ ప్రతికూలత వెలువడింది. ఇది తరువాత సమసిపోయింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, నూతన మంత్రి మండలి ఏర్పాటు సజావుగా సాగేందుకు ఎన్‌డిఎ జాతీయ స్థాయి నాయకత్వం తగు చర్యలు తీసుకుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీహార్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎన్నిక కార్యక్రమానికి కేంద్ర పరిశీలకులుగా బిజెపి నియమించింది. ఆయన సోమవారం పాట్నాకు చేరుకునే వీలుంది. సింగ్ నియామకం గురించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు.
బిజెపి సిఫార్సు మేరకు కేంద్రంలోని సీనియర్ నేతల సూచనల క్రమంలోనే లెజిస్లేటర్లు అంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అంతా ప్రజాస్వామిక పద్థతిలో జరుగుతుందని అంతకు ముందు జెడియు సీనియర్ నేత, శాసనసభా వ్యవహారాల మంత్రి విజయ్‌కుమార్ చౌదరి మీడియాకు తెలిపారు. బీహార్‌కు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నితీష్ ఇకపై జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. తరువాతి ముఖ్యమంత్రి ఎవరనేది కేంద్ర నాయకత్వం ఖరారు చేస్తుందని బీహార్ బిజెపి మాజీ అధ్యక్షులు , మంత్రి దిలీప్ జైస్వాల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు కీలకమైన హోం శాఖను నిర్వహిస్తోన్న సామ్రాట్ చౌదరి కొత్త ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు తలెత్తాయి. ఇటీవలి కాలంలో ఆయన తరచూ ఢిల్లీ నుంచి పిలుపు మేరకు వెళ్లిరావడం, కేంద్ర నాయకత్వంతో మాట్లాడటం వంటి పరిణామాలతో ఆయనే సిఎం అని భావిస్తున్నారు.