
నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన కంటెంట్, పంచ్ డైలాగ్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. దీంతో నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా బిజీ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్న సమయంలోనే ఇటీవల తన పర్సనల్ విషయాలతో వార్తలలో నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను, విడాకుల అనంతరం తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వెల్లడించారు. ఒకప్పుడు ఇతరులను సులభంగా నమ్మే తానెలా మారిపోయాడన్నది ఆయన తన అనుభవాల ద్వారా వివరించారు. ప్రస్తుతం తనకు మనుషులపై పూర్తిగా నమ్మకం లేదని అన్నారు.
తన విడాకుల తర్వాత తీవ్ర ఒంటరితనాన్ని అనుభవించిన సమయంలో, తన పనిమనిషిని అక్కా అని ఆప్యాయంగా పిలిచి ఆదరించానని ప్రసాద్ తెలిపారు. ఆమెకు 3,000 రూపాయల జీతం అడిగితే, 6,000 రూపాయలు ఇచ్చానని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రతి వారం కేజీ మటన్, కుటుంబం మొత్తానికి నాలుగు సినిమా టికెట్లు, నెలవారీ సరుకులు, బియ్యం వంటివి కొనిస్తూ అండగా నిలిచానని చెప్పారు. ఆ పనిమనిషి కేవలం ఇంటి పనులు మాత్రమే కాకుండా, తనతో కబుర్లు చెప్పి, ఒంటరితనం నుంచి బయటపడటానికి సహాయపడిందని ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ ఆదరణకు ప్రతిగా ఆమె తన నమ్మకాన్ని వమ్ము చేసిందని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఖరీదైన గడియారాలు, ముఖ్యంగా 90,000 రూపాయల విలువైన యాపిల్ వాచ్‌ను దొంగిలించిందని, అది బజర్ మోగడం వల్ల పట్టుబడిందని వివరించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, మనుషుల పట్ల నమ్మకాన్ని కోల్పోయేలా చేసిందని ఆయన తెలిపారు. ఈ సంఘటన తర్వాత, ఆమె కుటుంబం క్షమాపణలు కోరినా, తను ఆమెను ఇంటి నుంచి పంపించివేశానని ప్రసాద్ చెప్పారు.
నమ్మకం కోల్పోవడం అనేది ఒక్క పనిమనిషి విషయంలోనే కాకుండా, తన మాజీ భాగస్వామితో ఎదురైన ఒక సంఘటన ద్వారా కూడా జరిగిందని ప్రసాద్ తెలిపారు. 250 రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు, తన మాజీ భాగస్వామి కోసం 180 రూపాయలతో నూడిల్స్ కొని, ఆమె ఆకలితో ఉందని భావించి తన నోటి వద్ద లాక్కుని మరీ తినిపించానని, అయితే ఆ నూడిల్స్ పడేశారని, డబ్బులు అడిగారని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటనలు తనను పూర్తిగా మార్చేశాయని, ప్రస్తుతం తాను ఎవరినీ నమ్మడం లేదని, ప్రేమగా పలకరించినా నమ్మలేకపోతున్నానని ఆయన స్పష్టం చేశారు. పులిహోర తెచ్చిస్తే కూడా సందేహించానని తెలిపారు. ప్రసాద్ ప్రస్తుతం డబ్బు విషయంలోనూ భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు. వచ్చిన డబ్బును పొదుపు చేయకుండా, ఇన్సూరెన్స్ మినహా మిగతాదంతా తనకు నచ్చిన రీతిలో ఖర్చు చేస్తున్నానని ఆయన వెల్లడించారు. దుస్తులు, బూట్లు వంటి వాటికి లక్షల్లో ఖర్చు చేసే స్థాయి తనది కానప్పటికీ, ఉన్నవి ఉన్నట్లు, పోతే పోతాయని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..