
- సొంత పార్టీ నేతలను అవమానించడంలో గులాబీ పార్టీకి సాటిలేదు: ఎంపీ చామల
- ఆ విషయం గమనించకుండానే జీవన్ రెడ్డి.. కేసీఆర్‌ను కలిశారు
- అమెరికా నుంచి దిగగానే జగిత్యాల వెళ్లడం పెద్ద డ్రామా అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: అవమానాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీయేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అవమానాల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లో జరిగిన అవమానాల లిస్టును చూస్తే కేటీఆర్ సిగ్గుతో తలవంచుకుంటారని అన్నారు.
2018లో పాలేరులో తుమ్మలపై గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డిని చేర్చుకుని, తుమ్మలకు కనీసం సభ్యత్వ నమోదు పుస్తకాలు కూడా ఇవ్వకుండా అవమానించారని మండిపడ్డారు. అలాగే కొల్లాపూర్ లో జూపల్లిపై గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని చేర్చుకుని జూపల్లిని కూడా అలాగే అవమానించారని గుర్తుచేశారు. 2014లో ఆరు నెలలు కాకముందే డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేశారని, బీసీ బిడ్డ ఈటల రాజేందర్‌ను ఎంతో అవమానకరంగా పార్టీ నుంచి పంపించారని ఫైర్ అయ్యారు.
పొంగులేటి, తుమ్మల, జూపల్లిని అవమానించలేదా అని ప్రశ్నించారు. చివరకు సొంత కుటుంబ సభ్యులైన హరీశ్ రావుకు మంత్రిపదవి ఇవ్వకుండా, కవితను లిక్కర్ కేసు కన్నా ముందే ఇంట్లో అవమానించిన చరిత్ర కేటీఆర్ దని విమర్శించారు. ‘‘బీఆర్ఎస్‌లో జరిగిన అవమానాల జాబితా చూడకుండానే జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని ఎంతో గౌరవించింది. ఆయనకు 14 బీ-ఫారాలు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో 50 కౌన్సిలర్ స్థానాలు ఉంటే 20 సీట్లు ఆయన మనుషులకే ఇచ్చాం. జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవి కూడా ఆయన వర్గానికే ఇచ్చాం” అని చామల గుర్తుచేశారు.
హరీశ్‌ను మించి కేటీఆర్ పెర్ఫామెన్స్
హరీశ్ రావును మంచి కేటీఆర్ పెర్ఫామెన్స్ ఉందని ఎంపీ చామల కిరణ్ ఎద్దేవా చేశారు. ‘‘అమెరికా నుంచి కేటీఆర్ రాగానే జగిత్యాల, ఇబ్రహీంపట్నం వెళ్లడం వెనుక పెద్ద డ్రామా ఉంది. తన బావ హరీశ్ రావు అసెంబ్లీలో బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. తాను కూడా ఏదో ఒకటి చేయాలనే ఆరాటంతోనే కేటీఆర్ పర్యటనలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన చేసి హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ లు కట్టుకున్నది కేసీఆర్ ఫ్యామిలీయేనని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన సోదరులను టార్గెట్ చేయడం సరికాదన్నారు.