Reading Time: < 1 minute
Telangana: సూపర్ హర్షిత.. ఇంటర్‌లో 994 మార్కులతో మెరిసిన రైతు బిడ్డ..

పొలంలో చెమట చిందించే తల్లిదండ్రులు.. చేతిలో పుస్తకం పట్టుకుని కలల్ని నాటుకున్న కూతురు.. అది కేవలం చదువు కాదు.. ఒక కుటుంబం కల. రైతు కుటుంబంలో పుట్టిన రాగాపురం హర్షిత.. చిన్నప్పటి నుంచే కష్టాన్ని దగ్గరగా చూసింది. ఎండలో పొలానికి వెళ్లే తల్లిదండ్రులు.. వర్షం కోసం ఆకాశం వైపు చూసే ఆత్రుత.. ఆ పరిస్థితుల మధ్యే ఆమె విద్యా ప్రయాణం మొదలైంది. పది తరగతిలోనే తెలంగాణ గర్నమెంట్‌ నడిపించే తాండూర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదివి 9.5 CGPA సాధించి తన ప్రతిభను చాటుకున్న హర్షిత.. ఇంటర్‌లో కూడా అదే పట్టుదలతో ముందుకు సాగింది. తల్లిదండ్రులు తనను చూసి గర్వంతో తలెత్తుకోవాలనే ఆశయంతో ముందుకు సాగించింది. ఆ కష్టం ఫలించింది.. ఇంటర్‌లో అద్భుతంగా తన స్కిల్స్‌ సానబెట్టి అత్యత్తమంగా 994 మార్కులు సాధించి.. A గ్రేడ్‌తో మెరిసింది. స్వాతి స్వగ్రామం వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని దోర్నాల్ గ్రామం. ఆమె తల్లిదండ్రులు స్వాతి- వెంకట్ రెడ్డి దంపతులు ఇప్పుడు పట్టరాని సంతోషంతో తమ బిడ్డను చూసి మురిసిపోతున్నారు.

ఇది కేవలం ఒక మార్కుల కథ కాదు.. ఇది రైతు ఇంటి ఆశల కథ.. ఇది కష్టానికి వచ్చిన గౌరవం.. ఇది ‘అసాధ్యం’ అనుకున్నవారికి సమాధానం. ‘మేము పొలంలో పండించేది పంట.. మా కూతురు చదివి పండించింది భవిష్యత్’ అంటున్నారు గర్వంగా తల్లిదండ్రులు. కుటుంబంలో ఒక్కరు మంచిగా చదివితే చాలు ఆ ఫ్యామిలీ భవిష్యత్ మారిపోతుంది. పేదరికం ఒక అడ్డంకి కాదు.. అవకాశం దొరికితే ప్రతిభ ఎలా వికసిస్తుందో చూపించింది హర్షిత. ఒక చిన్న గ్రామం నుంచి.. ఒక పెద్ద విజయానికి నాంది పలికి.. ఎంతోమంది పిల్లలకు ఆదర్శంగా నిలిచింది. ఇదే ప్రదర్శనతో ఈ అమ్మాయి ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరుకుందాం…

Also Read: మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..