Reading Time: < 1 minute

కీసర కారు యాక్సిడెంట్ విషాదం.. డ్రైవింగ్ సీటులో కూర్చున్న మనిషి కూర్చున్నట్టుగానే..

Caption of Image.

కీసర: విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా కీసర టోల్ గేట్ దగ్గర బీఎండబ్ల్యూ కారుపై కాంక్రీట్ ట్యాంకర్ పడిన ఘటనలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బొద్దులూరి శ్రీనివాసరావు చనిపోయారు. కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. డ్రైవింగ్ సీటులో ఉన్న ఆయన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న మనిషి కూర్చున్నట్టుగానే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన కారు బొద్దులూరి శ్రీనివాసరావు పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయి ఉంది. హైదరాబాద్ అమీర్ పేట్ లోని ఎల్లారెడ్డిగూడలో శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయనకు సొంత ఇల్లు కూడా ఉంది.

హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్న ఆయన వృత్తిపరమైన విషయమై పని మీద విజయవాడకు వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా మృత్యువు ఇలా ఊహించని విధంగా కాంక్రీట్ ట్యాంకర్ రూపంలో కబళించేసింది. కారు డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసరావుది ఈ ఘటనలో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ కాంక్రీట్ డ్రైవర్ నిర్లక్ష్యం.. హెవీ లోడ్తో వెళుతున్న కాంక్రీట్ ట్యాంకర్ టర్న్ తీసుకుంటున్న క్రమంలో అదుపు తప్పి కారు మీద పడటంతో శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. టర్న్ తీసుకుంటున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే అదుపు తప్పి ట్యాంకర్ కారుపై పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

రెడీమిక్స్ లోడ్తో ఉండటం వల్లే ట్యాంకర్ కారుపై పడగానే కారు ముందు భాగం.. ముఖ్యంగా డ్రైవింగ్ సీటు నుజ్జునుజ్జయింది. టోల్ ప్లాజాల దగ్గర రోడ్లు విశాలంగా ఉంటాయి. ట్యాంకర్ల లాంటి హెవీ వాహనాలు యూటర్న్ తీసుకునే క్రమంలో వెనుక వస్తున్న వాహనాలను గమనించకపోతే ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. వాహనదారులు కూడా టోల్ కట్టేయగానే రయ్మని దూసుకెళ్లకుండా రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంది.

©️ VIL Media Pvt Ltd.