Reading Time: 2 minutes
Chanakya Niti Success Tips Power Of Silence And Speech Control

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’ ద్వారా మానవాళికి ఎన్నో అద్భుతమైన సూత్రాలను అందించారు. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు, మన ప్రవర్తన, మాటతీరు కూడా కీలకమని ఆయన ఈ గ్రంథంలో నొక్కి చెప్పారు. ముఖ్యంగా ‘తక్కువ మాట్లాడటం’ (మితభాషిగా ఉండటం) అనేది ఒక వ్యక్తిని విజయపథంలో ఎలా నడిపిస్తుందో చాణక్యుడు వివరించిన తీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..

చాణక్యుని ప్రకారం.. జ్ఞానానికి అసలైన నిదర్శనం మాటలను అదుపులో ఉంచుకోవడమే. తక్కువ మాట్లాడే వారు జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడతారని ఆయన సూచించారు. ఎక్కువగా మాట్లాడేవారు తమ శక్తిని అనవసరమైన చర్చల్లో వృథా చేస్తారు. కానీ తక్కువ మాట్లాడే వ్యక్తులు తమ శక్తిని అంతర్గతంగా దాచుకుని, తమ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు. ఈ ఏకాగ్రత వారిని ఇతరుల కంటే వేగంగా విజయం వైపు నడిపిస్తుంది. తక్కువ మాట్లాడేవారు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి, పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాతే స్పందిస్తారు. వారు మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పష్టత, బలం ఉంటాయి. అందుకే సమాజంలో ఇలాంటి వారు మాట్లాడేటప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా వింటారు, గౌరవిస్తారు.

“నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అన్నట్లుగా.. ఆలోచించకుండా మాట్లాడేవారు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటారు. కానీ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు ముందుగా విశ్లేషించి స్పందించడం వల్ల అనవసరమైన గొడవలు, మాట జారడం వంటి తప్పులు జరగకుండా కాపాడుకోగలరు. చాణక్యుని రాజనీతిలో వ్యూహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వివేకవంతుడైన వ్యక్తి తన ప్రణాళికలను, రహస్యాలను అందరికీ వెల్లడించడు. తక్కువ మాట్లాడే అలవాటు వల్ల తమ తదుపరి అడుగు ఏంటో శత్రువులకు లేదా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివల్ల మోసపోయే ప్రమాదం తప్పుతుంది. ప్రతిచోటా మాట్లాడటం కంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని చాణక్యుడు పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే స్థితిలో అవతలి వారు లేనప్పుడు, విజ్ఞానం లేని చోట అనవసర చర్చలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం చాలా ముఖ్యం అని చెప్పారు. సమాజంలో గౌరవం పెరగాలన్నా, వ్యక్తిత్వ వికాసం సాధించాలన్నా మితభాషిగా ఉండటం అవసరమని చాణక్య నీతి చెబుతోంది. తక్కువ మాట్లాడితే మాటకే కాదు, మనిషికి కూడా విలువ పెరుగుతుందన్నారు.

READ ALSO: US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?