
US-Iran Talks: అమెరికా-ఇరాన్ మధ్య శాంతికోసం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. దీంతో పాకిస్తాన్ ఏదో సాధించినట్లుగా అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము సూపర్ పవర్‌గా మారినట్లు దాయాది దేశం తెగ బిల్డప్ ఇస్తోంది.
ఒక వేళ చర్చలు విఫలమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటని ఎవరూ ఆలోచించడం లేదు. ఇదే జరిగితే, చర్చలు విఫలం అయితే దాయాదికి దబిడి దిబిడే. మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుంది. ఇప్పటికే చర్చలు కొలిక్కి రాకుంటే, ఒక డీల్ చేసుకోకుంటే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
యుద్ధంలోకి పాకిస్తాన్:
ఈ చర్చలు విఫలమైతే పాకిస్తాన్ యుద్ధంలోకి లాగబడొచ్చు. సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులు చేస్తుంది. సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో సౌదీకి మద్దతుగా పాక్ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తల్ని మరింత పెంచుతుంది.
ముప్పేట దాడి:
ఒక వేళ ఇరాన్ యుద్ధం మళ్లీ ప్రారంభమైతే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా అదుపు తప్పొచ్చు. బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), కైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్లు, మరోవైపు యుద్ధంలోకి ప్రవేశిస్తే ఇరాన్ దాడులకు పాల్పడవచ్చు.
అమెరికా ఒత్తిడి:
ఇదే సమయంలో ఇరాన్‌పై దాడులకు పాక్ తన ఎయిర్ బేసులు ఇవ్వాలని అమెరికా ఒత్తిడి పెంచొచ్చు. ఒక వేళ ఇదే జరిగితే పాక్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇరాన్ తర్వాత, పాక్‌లోనే షియా జనాభా ఎక్కువ. వీరంతా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. ఇటు అమెరికా మాటకు ఒప్పుకోకుంటే, పాక్‌తో అమెరికా సంబంధాలు దెబ్బతింటాయి.
పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ఛాన్స్:
ఓ వైపు యుద్ధం, మరోవైపు అంతర్గత సమస్యలతో ఇప్పటికే పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. ఒక వేళ సౌదీ తరుపున యుద్ధంలోకి లాగబడితే ఇరాన్ కన్నేర్ర చేయడం ఖాయం. ఇరాన్‌పై దాడికి పాక్ తన ఆర్థిక వనరుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల ఇంధనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంధన కొరత ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.