Reading Time: 2 minutes
Bihar New Cm Selection Shivraj Singh Chouhan Observer Nitish Kumar

Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగవంతం చేసింది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీహార్ పరిశీలకుడిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు తాజాగా నియమించింది. బీహార్ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునే బాధ్యతను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అప్పగిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆయన బీహార్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలందరితో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు బీజేపీ తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక ప్రక్రియ చౌహాన్ పర్యవేక్షణలో జరుగుతుందని వెల్లడించింది.

READ ALSO: షుగర్, బిపి కంట్రోల్ అవ్వాలా? మీ డైట్‌లో ఈ గింజలను చేర్చుకోండి!

ఏప్రిల్ 14న కీలక క్యాబినెట్ భేటీ
బీహార్ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని క్యాబినెట్ గదిలో ముఖ్యమైన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించనున్నారు. నితీష్ కుమార్ పదవీకాలంలో ఇదే చివరి క్యాబినెట్ సమావేశం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీళ్లే..
ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ.. “ఎన్డీఏ (NDA) శాసనసభ పక్షం తమ నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటే వారే ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో భారతీయ జనతా పార్టీ నిర్ణయమే కీలకం” అని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నిరంతరం ముఖ్యమంత్రితో భేటీ అవుతుండటంపై స్పందిస్తూ.. వారు గతంలోనూ క్రమం తప్పకుండా కలుసుకునేవారని, దీనిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగడంతో బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీష్ కుమార్ తదుపరి అడుగు ఏంటనేది ఏప్రిల్ 14 నాటి క్యాబినెట్ భేటీ తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉందని సమాచారం.

READ ALSO: Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్‌మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..