
- ఆర్ఆర్ తో మ్యాచ్ సందర్భంగా ఆంక్షలు
- మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు అమలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరగనున్న ఐపీఎల్ మ్యాచ్నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. నాగోల్ నుంచి హబ్సిగూడ (ఉప్పల జంక్షన్ వరకు ), బోడుప్పల్ నుంచి అంబర్ పేట్ (ఉప్పల్ జంక్షన్ , రామాంతపూర్ మార్గం) వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాడితే ఇబ్బందులు ఉండవన్నారు. లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎంసీ వెహికల్స్, జేసీబీలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్లు డైవర్షన్ రూట్లలోనే వెళ్లాలన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు ఇవే..
ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వెహికల్స్ ను మెహఫిల్ హోటల్ వద్ద హెచ్ఎండీఏ ఉప్పల్ భగాయత్ ప్రవేశద్వారం వద్ద నాగోల్ – ఎల్బీ నగర్ వైపు మళ్లిస్తారు. ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూ-టర్న్ తీసుకుని నాగోల్ యూ-టర్న్ – హెచ్‌ఎండీఏ భగాయత్ , టయోటా యూ-టర్న్ , బోడుప్పల్ , చెంగిచెర్ల ఐఓసీఎల్, చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వెహికల్స్ హబ్సిగూడ ఎక్స్ రోడ్, నాచారం, ఎన్‌ఎఫ్ సీ రోటరీ, ఐఓసీఎల్ చర్లపల్లి మీదుగా ఘట్‌కేసర్ వైపు పంపిస్తారు.
రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు స్ట్రీట్ నంబర్8 నుంచి హబ్సిగూడ ఎక్స్ రోడ్డు, నాచారం, ఎన్‌ఎఫ్ సీ రోటరీ, ఐఓసీఎల్ చెర్లపల్లి నుంచి ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ఉప్పల్ రూట్లో ద్వారా వచ్చే భారీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ మార్గంలో ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఉప్పల్ మార్గంలో వెళ్లే వాహనాలు ఎల్బీ నగర్, హయత్నగర్ ద్వారా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి వరంగల్ చేరుకోవాలి.
పార్కింగ్ ఎక్కడ.. ఎలా
సోమవారం మ్యాచ్ సందర్భంగా ఐదు ప్రధాన పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు స్టేడియం బయట 500 మీటర్ల పరిధిలో ఉండగా, ఒకటి స్టేడియం లోపల వీవీఐపీ, వీఐపీ పాస్ హోల్డర్లకు కేటాయించారు.
ఎల్బీ నగర్ నుంచి వచ్చే వెహికల్స్ : డీఎస్‌ఎల్ ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ, ఎల్జీ గోదాం జంక్షన్ నుంచి కెమ్‌వేదా జంక్షన్ వరకు ఇండస్ట్రియల్ లేన్ రోడ్డు పక్కన పార్క్చేయాలి.
రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు : డీఎస్‌ఎల్ మాల్ వద్ద యూ -టర్న్ తీసుకుని డీఎస్‌ఎల్ ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ, ఎల్జీ గోదాం జంక్షన్ నుంచి కెమ్‌వేదా జంక్షన్ వరకు పార్కింగ్ చేసుకోవాలి.
హబ్సిగూడ నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చే వెహికల్స్ : సర్వే ఆఫ్ ఇండియా వద్ద యూ -టర్న్ తీసుకుని ఈకే మినార్ వద్ద పెంగ్విన్ పార్కింగ్, టీజీ ఐలా పార్కింగ్ ప్లేస్ లో నిలపాలి.