
మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తమను వేధిస్తున్నారని, ఆయన కారణంగా తాను ఆసుపత్రి పాలైనట్లు ఆరోపిస్తూ ఎక్సై జ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కమిషనర్ హరికిరణ్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపణలు చేస్తూ డిసి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీల నిమిత్తం కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు తన పట్ల హరికిరణ్ దుర్భాషలాడినట్లు సోమిరెడ్డి ఈ వీడియోలో ఆరోపించారు. అతడి మాటలను తట్టుకోలేక తాను కిందపడిపోయాయ ని దాంతో తనను స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను ఈ విషయంలో చాలా ఆవేదనకు గురైనట్లు,
ఉ ద్యోగం వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు, మిత్రులకు, ఎక్సైజ్ కుటుంబ సభ్యులకు సోమిరెడ్డి ధన్యవాదా లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉం దని ఆయన తెలిపారు. తనలాంటి వ్యక్తి ఈ శాఖ లో ఇమడలేడని చాలాసార్లు అనిపించిందని, తన మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఇన్ని రోజులు తాను నెట్టుకొచ్చానని వారికి ఎప్పటికీ రు ణపడి ఉంటానని ఆయన తెలిపారు. ఇక, ప్రస్తు తం తాను ఈ ఉద్యోగంలో ఇమడలేనని పూర్తిగా అర్థం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. చేయని తప్పుకి వెధవ, ఇడియట్ అన్నప్పుడు తన సున్నిత మనస్తత్వం ఆ మాటను స్వీకరించలేక పోయిందన్నారు. తాను ఒక్కటే మాట ఎదురు చెప్పానని, ఇలాంటి మాట అనొద్దు సార్ అని మాత్రమే అన్నానని, తాను ఎదురు చెప్పిన ఆ చివరి మాటకు కమిషనర్ ఈగో హర్ట్ అయిందనుకుంటానని ఆయన తెలిపారు.
ఆకలితోనైనా చస్తాం కానీ..
నా జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని ఘోర అవమానం కమిషనర్ చేశారని ఆయన తెలిపారు. నాతోనే నేను వేధవను అనిపించేలా ప్రయత్నం చేశారన్నారు. అదే గదిలో నలుగురు అధికారులు, సిబ్బంది ఉన్నారని, వారి ముందు నాకు పరిస్థితి రావడం చాలా మానసిక వ్యధకు గురి చేసిందన్నారు. అరేయ్, ఒరేయ్, వెధవ, ఇడియట్, యూస్ లెస్ ఫెలో ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా, దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న అధికారులకు, మిత్రులకు ఇతర అధికారులకు నమస్కారమని, తాను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవింతం అని నమ్మానని,
ఆకలితోనైనా చస్తాం కానీ, ఆత్మాభిమానం వదులుకోలేనని సోమిరెడ్డి తెలిపారు. అన్న కాళోజీ మాటలు యాది చేసుకుంటూ చేతకాని చావలేని, చైతన్యం చచ్చిపోయిన ఈ శాఖలో 30 సంవత్సరాలుగా పని చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. నా కుటుంబ సభ్యులతో చర్చించానని, ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి శాఖను (ఉద్యోగం) వీడి వెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఇన్ని సంవత్సరాలు తనతో ప్రయాణం చేసిన, తనకు సహకరించిన ఉన్నతాధికారులకు మిత్రులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలని ఆయన అన్నారు. ఈ వీడియో పోస్టు ఎంతో మానసిక సంఘర్షణకు లోనై పెడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలి: జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి
ఎక్సైజ్ కమిషనర్ తీరుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరికిరణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు పెన్‌డౌన్‌కు సైతం పిలుపునిచ్చినట్టు వారు ప్రకటించారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులను దూషిస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న ఆబ్కారీ కమిషనర్ తీరును వారు ఖండించారు. –