Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi Ipl Performance Tanvir Ahmed Comments Abhishek Sharma

Tanvir Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఎందరో యంగ్ టాలెంట్లను మనం చూశాం. కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఒక కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వండర్ కిడ్.. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి మేటి బౌలర్లను సైతం బెంబేలెత్తించాడు. ఈ సీజన్‌లో వైభవ్ వరుసగా రెండోసారి 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించడం విశేషం (గతంలో సీఎస్‌కేపై కూడా ఇలాగే ఆడాడు).

READ ALSO: Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

అభిషేక్ శర్మను మర్చిపోతారు: తన్వీర్ అహ్మద్
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ధాటికి టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రేజ్ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వైభవ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే.. ప్రజలు అభిషేక్ శర్మను మర్చిపోతారు. వీరిద్దరూ కలిసి బ్యాటింగ్ చేస్తే అందరి కళ్లు వైభవ్ పైనే ఉంటాయి. అభిషేక్ దరిదాపుల్లో కూడా ఉండడు. ప్రస్తుతం వైభవ్ ఉన్న ఫామ్ చూస్తుంటే ఎవరైనా అతనికే ఓటేస్తారు” అని అన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇదే సమయంలో వైభవ్ నిలకడగా రాణిస్తుండటంతో వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌లలో 50.00 సగటుతో 200 పరుగులు సాధించాడు. కేవలం దూకుడుగానే కాకుండా, వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ సంయమనంతో ఆడటం వైభవ్ ప్రత్యేకతగా చెబుతున్నారు. త్వరలోనే టీమిండియాలోకి ఈ యువ సంచలనం అడుగుపెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అభిషేక్ శర్మ తన ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడా లేక వైభవ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడా అనేది వేచి చూడాలి.

READ ALSO: US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..