
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు అక్షర్ చెప్పాడు. దేశవాళీ స్టార్ ప్లేయర్స్ అకిబ్ నబీ, అశుతోష్ శర్మ తుది జట్టులోకి వచ్చారు. జమ్మూ కాశ్మీర్ పేసర్ నబీకి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. సీఎస్‌కే కూడా రెండు మార్పులు చేసినట్లు సారథి రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఈరోజు మ్యాచ్ ఆడుతున్నాడు. గుర్జప్నీత్ సింగ్ సీఎస్‌కే తరపున మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు.
టాస్ సందర్భంగా చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి అడిగిన ప్రశ్నకు రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ధోనీ హోటల్‌లో నుంచే జట్టుకు మద్దతు ఇస్తున్నారని, త్వరలోనే మైదానంలో కనిపిస్తారని చెప్పాడు. మహీ వచ్చే 1-2 మ్యాచులలో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధోనీ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్‌లలో మైదానంలో కనిపించకపోవడం, డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే చెన్నై కెప్టెన్ హోటల్‌లో ధోనీ ఉన్నాడని చెప్పడం, త్వరలోనే మ్యాచ్ ఆడుతాడని చెప్పడంతో ఫాన్స్ ఆనందపడిపోతున్నారు.
రుతురాజ్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్‌లో జట్టు లక్ష్యం ఒకటే. తొలి విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలి. జట్టు అన్ని విభాగాల్లో మెరుగవుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో. అయితే కీలక సమయాల్లో కొన్ని తప్పిదాలు జరిగాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు బాగా సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని చెప్పాడు. సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో మంచి ఆరంభం చేయాలని భావిస్తోంది.