
శ్రీశైలం వెళ్లే భక్తులకు తీపికబురు. శ్రీశైలంకు తరచూ వేలాదిమంది భక్తులు వెళ్తుంటారు. ఇక మహాశివరాత్రి సమయంలో అయితే ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కొన్నిసార్లు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. దీంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముందడుగు వేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్దమయ్యాయి. అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి. ఇది పూర్తయితే శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవతంగా ఉంటుంది. ఎలాంటి వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్య ఉండదు.
86 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్
మొత్తం 86.74 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఏపీ పరిధిలో 41.39 కిలోమీటర్లు, తెలంగాణ పరిధిలో 45.35 కిలోమీటర్లు ఉండనుంది. నాలుగు లైన్లు రహదారిగా దీనిని నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.18,500 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఏపీ పరిధిలో చేసే నిర్మాణానికి ర.10,500 కోట్లు, తెలంగాణ పరిధిలో నిర్మాణానికి రూ.8 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇక శ్రీశైలం డ్యామ్ మధ్యలో 450 మీటర్ల మేర కొత్త ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని చూస్తున్నారు. ఇక శ్రీశైలం క్రాస్ రోడ్ వల్ల నుంచి ఆలయం వరకు 4.33 కిలోమీర్ల మేర స్పర్ రోడ్ నిర్మించేందుకు ప్లాన్ రూపొందించారు. తెలంగాణ, ఏపీ పరిధిలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీకి సమర్పించారు. దీంతో అటవీశాఖ సలహాలు, సూచనలను కేంద్రం కోరింది. అనంతరం కేంద్ర జాతీయ రహదారుల శాఖ వద్దకు అటవీశాఖ సూచనలు పంపనుంది.
ఎక్కడివరకంటే..?
ఈ నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ ఏపీలోని దోర్నాల నుంచి తెలంగాణలోని బ్రహ్మణపల్లి వరకు ఉంటుంది. ప్రస్తుతం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. వన్య ప్రాణులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆ తర్వాత వాహనాలను నిలిపివేస్తున్నారు. అయితే ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులో వస్తే ఎప్పుడైనా రాకపోకలు సాగించవచ్చు. ప్రస్తుతం దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లేందుకు నేషనల్ హైవే 765 అందుబాటుల ఉంది. ఈ హైవేను నాలుగు లైన్లుగా విస్తరించాలని ముందుగా అధికారులు ప్రతిపాదించారు. కానీ అటవీశాఖ భూములను సేకరించడంలో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఇది అందుబాటులోకి వస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది.