Reading Time: 1 minute

అమెరికా ఇరాన్ మధ్య ప్రధాన విభేదాలు ఇవే

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్‌లో శనివారం (ఏప్రిల్ 11) జరిగిన అమెరికాఇరాన్ శాంతి చర్చలు 21 గంటలపాటు కొనసాగినప్పటికీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయాయి. ఈ చర్చలు ఎందుకు విఫలమయ్యాయనే అంశంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, తమ బృందం చివరి, ఉత్తమ ప్రతిపాదనను సమర్పించిన తర్వాత చర్చల నుంచి నిష్క్రమించిందని తెలిపారు. ఈ పరిణామం ఇరాన్‌కు చేదు వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. 21 గంటలపాటు జరిగిన రహస్య చర్చల వివరాలను వెల్లడించడానికి వాన్స్ నిరాకరించినప్పటికీ, ప్రధాన విభేదం అణ్వాయుధాల అంశంపైనేనని స్పష్టం చేశారు. మాకు ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదనే స్పష్టమైన హామీ కావాలి. అలాగే అణ్వాయుధాలను త్వరగా తయారు చేయగల సామర్థ్యాన్ని కూడా వారు పొందకూడదు అని వాన్స్ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం ఇదేనని, ఈ చర్చల ద్వారా అదే సాధించాలని ప్రయత్నించామని చెప్పారు. ఇరాన్ లోని యురేనియం శుద్ధి కేంద్రాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని వాన్స్ తెలిపారు. అయినప్పటికీ, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా విరమించాలనే స్పష్టమైన సంకల్పం ఇరాన్ లో కనిపించడం లేదని ఆయన అన్నారు. ఇరాన్ కు భవిష్యత్తులో అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనే దృఢ సంకల్పం ఉందా? ఇప్పటివరకు అలాంటి సంకేతాలు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆ సంకేతాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం అని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ మాత్రం తాము అణుబాంబు తయారీ ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేస్తోంది.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలోనూ, అంతకుముందు కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌కు చెందిన సున్నిత ప్రాంతాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. చర్చల్లో ఇరాన్‌కు సంబంధించిన ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల అంశం చర్చకు వచ్చిందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, అనేక అంశాలు చర్చకు వచ్చాయని, కానీ ఇరాన్, అమెరికా షరతులను అంగీకరించే స్థితికి రాలేదని వాన్స్ తెలిపారు. ఇరాన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ ప్రకారం, హార్మూజ్ జలసంధి నియంత్రణ సహా పలు అంశాలు రెండు దేశాల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. మొత్తంగా, అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధి, ఆంక్షలు, ఆస్తుల విడుదల వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమైనట్టు స్పష్టమవుతోంది.