
Sunil Gavaskar: ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ యువ సంచలనంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ ప్రదర్శనను ప్రశంసిస్తూనే, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై గవాస్కర్ అతడిని హెచ్చరించారు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వంటి భారీ వేదికపై వైభవ్ సూర్యవంశీ చూపుతున్న తెగువ చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ వంటి బలమైన జట్ల బౌలర్లను సైతం చితకబాదుతూ అతను ఆడుతున్న తీరుపై గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. బంతి లెంగ్త్‌ను ముందే పసిగట్టే అద్భుత సామర్థ్యం వైభవ్‌కు ఉందని సన్నీ కొనియాడారు.
READ ALSO: Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..
వైభవ్ ప్రతిభను మెచ్చుకుంటూనే గవాస్కర్ మీడియాకు, వైభవ్ అభిమానులకు ఒక కీలక విన్నపం చేశారు. ఈ చిన్న వయసులోనే అతనిపై భారీ అంచనాలు భారం వేయవద్దని కోరారు. “ఏ ఆటగాడిపైనైనా అతిగా అంచనాలు పెట్టుకోవడం వారి ఉజ్వల భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉంది” అని సన్నీ హెచ్చరించారు. వైభవ్ ప్రస్తుత ఫామ్ బాగున్నా, రాబోయే రోజుల్లో ప్రత్యర్థి జట్లు అతడిని మరింత నిశితంగా గమనిస్తాయని గవాస్కర్ విశ్లేషించారు. కాలం గడిచేకొద్దీ ప్రత్యర్థి కోచ్‌లు, బౌలర్లు వైభవ్ బలహీనతలను కనిపెడతారన్నారు. కేవలం టెక్నిక్ మాత్రమే కాదు, ఒత్తిడిలో వైభవ్ ఎలా స్పందిస్తాడనేది కూడా ప్రత్యర్థులు గమనిస్తారని చెప్పారు. “నీ లోపాలు బయటపడినప్పుడు, వాటిని సరిదిద్దుకుని బలాలుగా మార్చుకోవడమే అసలైన విజయం. అదే ఒక గొప్ప ఆటగాడికి పరీక్ష” అని గవాస్కర్ వైభవ్‌కు దిశానిర్దేశం చేశారు.
READ ALSO: LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!