Reading Time: < 1 minute
Ipl 2026 Sanju Samson Smashes First Century Of Season Csk Set 213 Target Vs Dc

ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దాంతో ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న సంజు.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీ (59) హాఫ్ సెంచరీ చేయగా.. శివమ్ దూబే (20) కీలక రన్స్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి సరైన ఆరంభం దక్కలేదు. ఐపీఎల్ 2026లో ఓపెనింగ్‌లో పెద్దగా రాణించని రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే అవుట్ అయ్యాడు. సంజు శాంసన్, ఆయుష్ మాత్రే జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించింది. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెళ్లగా.. సంజు మాత్రం మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన సంజు.. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి శతకం నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

సంజు శాంసన్ 56 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో శివమ్ దూబే (20 నాటౌట్) కూడా వేగంగా ఆడడంతో చెన్నై స్కోర్ 200 దాటింది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ముఖేశ్ కుమార్ 15 పరుగులు ఇవ్వడంతో సీఎస్‌కే భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టగా.. నటరాజన్, లుంగి ఎంగిడి భారీగా పరుగులు ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.