Reading Time: 2 minutes
Weather Report: బయటకు రావొద్దు బాబోయ్.. రాబోయే 10 రోజులు డేంజర్ బెల్స్.. ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎండలపై ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. రాబోయే పది రోజుల పాటు ఎండలు దంచికొట్టనున్నాయని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని సూచించింది. 10 రోజుల పాటు విపరీతమైన ఎండ తీవ్రత ఉంటుందని, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని తెలిపింది. గరిష్టంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, అలాగా దీనికి తోడు వడగాల్పులు బలంగా వీస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుందని, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అంచనా వేసింది.

40 డిగ్రీలకు పైగా..

40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఒకవేళ అత్యవసరమై బయటకు వెళితే వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది. వృద్దులు, పిల్లలు, గర్బిణులు జాగ్రత్తగా ఉండాలని, ఎండలకు బయటకు వెళ్లవద్దని సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు గరిష్ణ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంటుందని అంచనా వేసింది. కాగా శుక్రవారం రోజు నల్లగొండ జిల్లా ఘనపూర్‌లో 41.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 27 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఏపీలో కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు విజయనగరం, పోలవరం, ఏలూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఇక 35 మండలాల్లో వడగాల్పులు, 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే భానుడి ప్రతాపం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో ఇప్పటికే భానుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హీట్ వేవ్‌తో పాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎండ మొదలవుతోంది. 10 గంటల తర్వాత ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుండగా.. ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో ఇళ్లల్లోనే ఉంటున్నారు. వచ్చే రెండు నెలల పాటు ఇటువంటి పరిస్థితులే ఉండనున్నాయి.