Reading Time: 2 minutes

భారతీయ దిగ్గజ గాయని ఆశా భోంస్లే మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదం లో ముంచెతింది. ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం చాలా తక్కువే అయినా, ఆమె పాడిన ఆ 8 పాటలు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి. 1981లో ’ఇది మౌనగీతం’తో మొదలుపెట్టి, 2007లో ’చందమామ’ సినిమాలోని ’నాలో ఊహలకు’ వరకు ఆమె గాత్రం తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఎస్పీ బాలు, ఇళయరాజా, రెహమాన్, కీరవాణి వంటి దిగ్గజాలతో కలిసి ఆమె చేసిన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక సంగీత ప్రియులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ తదితర సినీ ప్రముఖులు ఆశా భోస్లె మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.

ఇక పదేళ్ల వయసులో 1943లో ఆమె సంగీత ప్రస్థానం ప్రారంభమైంది.. కొన్ని దశాబ్దాలపాటు అప్రతిహతంగా సాగింది. 12 వేలకు పైగా పా టలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్‌లో చోటు సంపాదించారు. సినిమా పాటలు, పాప్ మ్యూజిక్, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో ఆమె సిద్ధహస్తురాలు. హిం దీతో పాటు, ఆమె 20కి పైగా భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడి అలరించారు. తెలుగు సినిమాల్లోనూ పాటలు పాడారు. ఆశా భోస్లే తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా, వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. 1981లో ’పాలు నీళ్లు’ అనే సినిమాలో ’ఇది మౌనగీతం’ అనే పాటను ఆలపించారు. ఆ తర్వాత 1988లో ’చిన్ని కృష్ణుడు’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ’జీవితం సప్త సాగరం’ అనే గీతాన్ని పాడారు. దీనికి ఆమె భర్త ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చారు.

ఇక 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన ’అశ్వమేథం’ సినిమాలో ఆశా భోస్లే రెండు పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె ఆలపించిన ’ఓ ప్రేమా’, ’సీతాకాలం ప్రేమకు’ పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అనిపించుకున్నాయి. ఇవి ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ‘ప్రేమకు ప్రేమంటే తెలుసా’(1995) మూవీలో ’జల్లంది మది’ అనే పాట పాడారు ఆశా భోస్లే. 1996లో ఎంఎం కీరవాణి ’పవిత్ర బంధం’ సినిమాలో ’ఐసాలకిడీ’ అనే సాంగ్ ను ఆమెతో పాడించారు. వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. ఆశా భోస్లేతో స్టేజ్ మీద ఈ సాంగ్ పాడించినట్లు చూపిస్తారు. ఇద్దరు’ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ’వెన్నెల’ పాట పాడింది కూడా ఈమెనే. దశాబ్దం తర్వాత 2007లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ’చందమామ’ చిత్రంలో ’నాలో ఊహలకు’ పాట పాడి తన గాత్రంతో మరోసారి తెలుగు సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. దీనికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చారు. ఇదే ఆమె తెలుగులో పాడిన చివరి సాంగ్. మొత్తంగా ఆశా భోస్లే తెలుగులో 8 పాటలు ఆలపించారు.