
తిరువీర్ హీరోగా ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన టీజర్,సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిలుగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “రాధాకృష్ణ తెలుగుపై మంచి పట్టు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాతో మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
ఈ వేడుకకు నేను రావడానికి కారణం తిరువీర్. ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. ‘పాపం ప్రతాప్’ కూడా పెద్ద సక్సెస్ అయి ఆ విజయాన్ని కొనసాగించాలి”అని అన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ “పాపం ప్రతాప్ సినిమా ఇవివి సత్యనారాయణ సినిమాలా అనిపిస్తుంది. మగాడు అంటే ఏడవకూడదు, బాధపడకూడదు అంటారు. కానీ మగాడు కూడా మనిషే.. ఆ భావాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ‘పాపం ప్రతాప్’.. ‘వీర ప్రతాప్’అనిపించుకుంటాను”అని తెలిపారు. డైరెక్టర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ “బయట చెప్పుకోలేక లోపల బాధపడుతున్న ప్రతి మగాడికి ఈ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుంది. బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి – ఈ సినిమా మామూలుగా ఉండదు. ‘పాపం ప్రతాప్’ నాకు మరిన్ని అవకాశాలు తెస్తుందని నమ్ముతున్నాను”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ రాకేష్ మాట్లాడుతూ “ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడుతున్నాం. మీరు పెట్టిన డబ్బులకు రెట్టింపు వినోదం ఉంటుంది. అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బివిఎస్ రవి, దశరథ్, సాయిలు కంపాటి, ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, అజయ్ ఘోష్ పాల్గొన్నారు.