Reading Time: 2 minutes

అమెరికా చమురు సంపన్న దేశం అని దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శనివారం గొప్పగా చెప్పారు. తమ దేశం వద్ద ఇప్పుడు రష్యా కన్నా ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. ఇప్పుడు ఇక సౌదీ ఇతర గల్ఫ్ దేశాలలో కూడా చమురు అడుగంటింది. దీనితో పలు ఖాళీ ట్యాంకర్లు చమురు కోసం అమెరికా తీరానికి చేరుకుంటాయని చమత్కరించారు. అమెరికా ఇప్పుడు తమ తియ్యటి ఆయిల్, కోరుకునే గ్యాస్‌ను ప్రపంచంలో ఎవరికైనా అందించేందుకు సంసిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు చమురు ఎగుమతులలో పై చేయి స్థితికి చేరామని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా వైపు వస్తున్నాయని , ఇంతకు ముందటి వరకూ చమురు సంపన్న దేశాల వారు కూడా ఇక్కడికి రావల్సిందే అన్నారు. వారికి స్వాగతం పలుకుతామని తెలిపారు.

అత్యున్నత ప్రమాణాల చమురు, సహజవాయవులు తమ వద్ద ఉన్నాయని, రెండు అత్యంత భారీ ఆర్థిక శక్తుల మిశ్రిత చమురు సంపదతో పోలిస్తే తమ వద్ద ఎక్కువ చమురు ఉందని పరోక్షంగా రష్యా , చైనా లేదా గల్ఫ్ దేశాల పరిస్థితిని తెలిపారు. ఈ సరుకు తీసుకుపోయే వారికోసం వేచి చూస్తున్నామని తెలిపారు. తొందరపడండి, ఆలస్యం వద్దు..డిజెటి అంటూ ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా సంచలనానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన ఇతర మీడియాలపై దుమ్మెత్తిపోశారు. బూటకపు మీడియా సంస్థలు తమ ప్రతిష్ట దెబ్బతీసుకున్నాయని విమర్శించారు. ఎప్పుడూ వారికి ట్రంప్‌ను తిట్టిపోసుకునే జబ్బు తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఈ లక్షణానికి ఆయన టిడిఎస్ అని సంబోంధించారు. ఇరాన్ అన్ని విధాలుగా దెబ్బతింటూ ఉంటే, కొందరు ఇరాన్ నౌకాదళం, వైమానిక బలగాలు దెబ్బతింటూ ఉంటే, వారికి నాయకుడు లేకుండా పోతే , క్షిపణులు , డ్రోన్లు కుప్పకూలితే సంబంధిత ఫ్యాక్టరీలు నేలమట్టం అయితే ఇంకా ఇరాన్ బలంగా ఉందనే వాదన తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు.

చివరికి ఇరాన్ వారి మిగిలిన నేతలతో కూడిన నౌకలు వారు అమర్చుకున్న సీ మైన్స్‌లో పడి దెబ్బతింటాయని తిట్టిపోశారు. ఇప్పటికే వారి 28 మైన్ బోట్లు సముద్రం అడుగుకు చేరాయని తెలిపారు. కొన్ని దేశాలకు హర్మూజ్‌ను తెరవాలని, చైనా , జపాన్, కొరియా మరికొన్ని దేశాల నేతలను ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నా ఇప్పుడు సీ మైన్స్ ఇరకాటంలో పడ్డారని తెలిపారు. వారంత వారుగా హర్మూజ్‌ను తిరిగి తెరిచే పరిస్థితిలో లేరని స్పందించారు. ఇతర దేశాలు కూడా హర్మూజ్ ఓపెన్ విషయంలో ఏమి చేయలేకపోతున్నాయి. ఈ దశలో చమురు కోసం పలు దేశాలు ఇప్పుడు అమెరికాకు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. ఈ విషయంపై దృష్టి పెడుతున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్రంప్ తమదైన రీతిలో తమ స్పందనను ముగించారు.

……………….