
కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా చేరువైంది ఈ కాఫీ ట్రెండ్. ఇది అందరికీ ఒకే రకమైన ఫలితాలను ఇస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఒకవైపు బరువు తగ్గడానికి సహాయపడుతుందని ప్రచారం జరుగుతుంటే, మరోవైపు దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అన్న అనుమానాలు కూడా వ్యూయర్లలో వ్యక్తమవుతున్నాయి. ఇదంతా బుల్లెట్ కాఫీ గురించే. నిపుణుల సూచనల ప్రకారం ఈ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు, జాగ్రత్తలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బుల్లెట్ కాఫీ అంటే..
సాధారణ కాఫీకి భిన్నంగా దీనిని బ్లాక్ కాఫీలో నెయ్యి లేదా వెన్న కలిపి తయారు చేస్తారు. ఇందులో పాలు లేదా చక్కెర అస్సలు వాడరు. ఈ పద్ధతిలో తయారైన కాఫీని తాగడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచకుండానే శక్తిని అందిస్తాయి.
బరువు తగ్గడంలో..
బుల్లెట్ కాఫీ తాగడం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఇందులో ఉండే ఫ్యాట్స్ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల మధ్య మధ్యలో చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. ఉదయాన్నే ఈ కాఫీ తాగడం వల్ల మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు, ఫలితంగా ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అల్పాహారం నుండి వచ్చే కేలరీలను మనం తగ్గించుకోవచ్చు.
బుల్లెట్ కాఫీ అందరికీ సరిపడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఇందులోని అధిక కొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి, ఏదైనా కొత్త ఆహారపు అలవాటును మొదలుపెట్టే ముందు మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
కేవలం బుల్లెట్ కాఫీ తాగడం వల్లే బరువు తగ్గిపోతామని అనుకోవడం పొరపాటు. ఉదయం ఈ కాఫీ తాగి, సాయంత్రం బజ్జీలు, సమోసాలు తింటే ఎటువంటి ఫలితం ఉండదు. సరైన వ్యాయామం, ప్రోటీన్లు మరియు కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటూ, ఆకలిని అదుపు చేసుకోవడానికి మాత్రమే దీనిని ఒక సాధనంగా వాడుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు దీనిని పాటిస్తేనే ఆశించిన ఫలితాలు అందుతాయి.