
US-Iran Talks: అమెరికా, ఇరాన్‌ల మధ్య చిగురించిన శాంతి ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం అనంతరం, ఇరాన్ వైఖరి పూర్తిగా మారిపోయింది. అమెరికాతో మరో విడత చర్చలు జరిపే ఉద్దేశం టెహ్రాన్‌కు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ చర్చల పట్ల అమెరికాకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం చర్చల నుంచి వైదొలగడానికి సాకు వెతుకుతోందని ఇరాన్ మీడియా ఆరోపిస్తోంది. అంటే టైమ్ పాస్ చేస్తోందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌లోని ఇరాన్ బృందానికి సన్నిహితంగా ఉన్న వర్గాలను ఉటంకిస్తూ, ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఫార్స్’ ఓ కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ప్రపంచం ముందు కోల్పోయిన తన విశ్వసనీయతను తిరిగి సంపాదించుకోవడానికే అమెరికాకు ఈ చర్చలు అవసరమయ్యాయని ఇరాన్ భావిస్తోంది. యుద్ధరంగంలో ఓటమి, ఎదురుదెబ్బలు తగిలినా కూడా అమెరికా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చలు విఫలమైనందుకు ఆ నిందను ఇరాన్‌పై వేయాలనే ఉద్దేశంతో చర్చలకు ఆమోదయోగ్యం కాని షరతులను విధిస్తోందని పేర్కొంది.
ఇస్లామాబాద్ చర్చలపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించారు. ఈ చర్చల్లో అనేక కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, రెండు ముఖ్యమైన విషయాలపై ఇరుపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఈ కారణంగానే చర్చలు తుది ఒప్పందానికి రాలేకపోయాయని వెల్లడించారు. ఇక ఈ చర్చల వెనుక ఉన్న ప్రధాన వివాదం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి). ప్రస్తుతం మూతపడి ఉన్న ఈ కీలక సముద్ర మార్గాన్ని తెరిపించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, తమ అనుమతి లేకుండా ఆ మార్గం తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ 21 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత ఖాళీ చేతులతో వాషింగ్టన్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ చర్చల ద్వారా ఏదో ఒక విజయాన్ని సాధించి ప్రపంచానికి చాటాలని అమెరికా ఆశపడినా, ప్రస్తుతం ఆ దేశానికి పరువు కాపాడుకునే దారి కూడా కనిపించడం లేదు. హోర్ముజ్ మార్గం ఇంకా మూతపడే ఉండటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గతంలో కంటే మరింత పెరిగాయి.