
వాషింగ్టన్: చంద్రుడి చుట్టూ విజయవంత పరిభ్రమణం తరువాత అమెరికా నాసాకు చెందిన ఆర్టెమిస్ బృందం తిరిగి భువికి చేరింది. 50 సంవత్సరాల తరువాత చంద్రుడిపైకి మానవ సంచారం చారిత్రక ఘట్టం అయింది. ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్‌తో కూడిన నలుగురు వ్యోమగాముల బృందంతో కూడిన ఆర్టెమిస్ 2 నౌక ఒరాయన్ క్యాప్సూల్ శనివారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 5.38 గంటలకు పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో సురక్షితంగా దిగింది. చంద్రుడి వీక్షణం, వాతావరణ పరిశీలన ముగిసింది. ఇక తమ ముందున్న లక్షం చంద్రుడిపైకి నిరంతరాయంగా మనుష్యులను చేరవేయడం అని నాసా నిర్వహణాధికారి, భారతీయ సంతతికి చెందిన అమిత్ క్షత్రియ విలేకరుల సమావేశంలో తెలిపారు. బృందం తీరం చేరిన తరువాత కొద్ది సేపటికి విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు ఆర్టెమిస్ క్యాప్సూల్ ల్యాండింగ్ దృశ్యాలను కోట్లాది మంది పలు రకాల సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించారు.
ఆర్టెమిస్ 2 విజయవంతం అయింది. ఇక చంద్రుడిపై అడుగిడే అత్యంత కీలక ఘట్టంతో కూడిన ఆర్టెమిస్ 4 తమ చంద్రమండల యాత్రల్లో భాగంగా, కొనసాగుతుందని నాసా అధికారి క్షత్రియ తెలిపారు. చంద్రుడి వైపు మార్గం సుగమం అయింది. ఇకపై మిగిలిన లక్షం సంపూర్తి అతి గొప్పది. ఇప్పుడు సాధించినది అతి తక్కువే అవుతుందని వ్యాఖ్యానించారు. నాసా తదుపరి లక్షాలు మనిషి చంద్రుడిపై నేరుగా దిగడం, అక్కడ ఉండేందుకు అవసరం అయిన శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం అని క్షత్రియ తెలిపారు. చంద్రుడిపై పరిభ్రమణపు ఇప్పటి యాత్రలో కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టియానా కోచ్, కెనడాకు చెందిన జెరెమి హాన్సెన్ ఉన్నారు. 1972 డిసెంబర్‌లో చంద్రుడిపైకి వ్యోమగాములు యుగెన్ సెర్నాన్, హరిసన్ స్కిమిట్ చేరుకుని , ముడు రోజుల పాటు చంద్రుడి ఉపరితల అధ్యయనం పూర్తి చేసుకుని వచ్చారు. ఈ కీలక చంద్ర మండల యాత్ర తరువాత చేపట్టిన రెండో యాత్ర ఇదే అయింది. ఈ యాత్ర వ్యోమగాములు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఈ యాత్ర సంచాలకులు రిక్ హెన్‌ఫ్లింగ్ తెలిపారు.
24000 మైళ్ల వేగం వేడిమి
క్యాప్సుల్ భూ వాతావరణంలోనికి గంటకు 24000 మైళ్ల వేగంతో ప్రవేశిస్తున్నప్పుడు విపరీతమైన వేడిమి ఉష్ణోగ్రతలు వెలువడ్డాయి. వీటిని తమ క్యాప్సూల్ పొరలు అత్యంత సమర్థవంతంగా తట్టుకున్నాయని, తాము సేఫ్ అని కమాండర్ వైజ్‌మ్యాన్ విజయ చిహ్నం చూపుతూ ప్రకటించారు. దీనితో నాసా మిషన్ కంట్రోలు రూంలో పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. చంద్రుడిని దగ్గరి నుంచి పరిశీలించడంతో పాటు ఈ వ్యోమగాముల బృందం ఇప్పుడు చంద్రుడిపై సూర్యగ్రహణం కూడా వీక్షించింది. అప్పటి పరిణామాలను రికార్డు చేసకుంది. భూమి నుంచి చుంద్రడు, చంద్రుడి నుంచి భూమి ఏ విధంగా ఉంటాడు? చంద్రుడిపై పరిణామాలు ఏ విధంగా అనేది ఎప్పటికప్పుడు వీక్షించి వీడియోలు పంపించారు. చంద్రుడిపైకి భద్రంగా చేరడం, సురక్షితంగా ఆనందంగా తిరిగిరావడం అనే రెండు లక్షాలు నెరవేరాయని నాసా నిర్వాహకులు తెలిపారు. ఇది ఓ లక్కు కాదు, దీని వెనుక వేయి మంది అపార పరిశ్రమ దాగి ఉందని వెల్లడించారు. ఈ యాత్ర మొత్తం 700,237 మైళ్లు సాగింది. గరిష్ట వేగం గంటకు 24664. వ్యోమగాములకు ముందుగా వైద్య పరీక్షలు జరిపి, తరువాత వారిని హుస్టన్‌లోని నాసా కేంద్రంలో కొద్ది రోజుల పాటు పరిశీలనకు ఉంచుతారు. తరువాత వారికి పూర్తి స్వేచ్ఛ కల్పిస్తారు.