Reading Time: < 1 minute

నేడు రాజస్థాన్‌తో పోరు

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భా గంగా సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సవాల్‌గా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌కు ఈ మ్యా చ్‌లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచిన రాజస్థాన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇందులోనూ గెలిచి టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్‌కు బౌలింగ్ సమ స్య వెంటాడుతోంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధిస్తున్నా దాన్ని కాపాడుకోలేక ఓటములు చవిచూస్తోంది. పంజాబ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో 219 పరుగుల భారీ స్కోరు ను సాధించినా ఫలితం లేకుండా పోయింది.

ఈ లక్ష్యాన్ని పంజాబ్ మరో ఏడు బంతులు మిగిలివుండగానే అలవోకగా ఛేదించింది. అంతకుముందు బెంగళూరు కూడా హైదరాబాద్ ఉంచిన 202 పరుగులు క్లిష్టమైన లక్ష్యా న్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. బ్యాటర్లు బాగానే ఆడుతున్నా బౌలిం గ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బౌలింగ్, ఫీల్డింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన బాధ్యత సన్‌రైజర్స్‌పై ఉంది. లేకుంటే మరో ఓటమి ఖాయమని చెప్పాలి.

మరోవైపు వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. అద్భుత ఆటతో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి పాలవ్వని రాజస్థాన్ ఈసారి కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ అసాధారణ రీతిలో రాణిస్తున్నాడు. వైభవ్, యశస్వి, పరాగ్, జురెల్, హెట్‌మెయిర్, జడేజా తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ఆర్చర్, జడేజా, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.