Reading Time: 2 minutes

 హైడ్రా అలజడితో ఐలాపూర్ ప్రాంతం పూర్తిగా అట్టుడికిపోయింది. హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌తో అమీన్‌పూర్‌లో మరోసారి భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. హైడ్రాకు చాలెంజ్ విసురుతూ కేసులపై కేసులు వేసిన అడ్వకేట్ ముఖీమ్ ఫామ్‌హౌజ్‌పై హైడ్రా పంజా విసిరింది. ఆయన గెస్ట్‌హౌజ్‌ను పూర్తిగా నేలమట్టం చేయడమే కాకుండా ముఖీమ్ సోదరుడు కిష్టారెడ్డిపేట్ సర్వే నెంబర్‌తో ఐలాపూర్ భూమిలో నిర్మించిన ఆరు అంతస్థుల భవనాన్ని సైతం కూల్చివేశారు. నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్‌ను ప్రభుత్వ యంత్రాంగం శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వహించింది. గతంలో ఎన్నడూ 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులతో కలిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ మార్కెట్‌లో రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ఇప్పటికే ఇళ్లు కట్ట్ట్టుకుని ఉన్నవారిని మినహాయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్ట్టుకున్న పేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎప్పటికప్పుడు అధికారులు మైక్ ద్వారా ప్రకటించాయి. దీంతో పేదలంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా ఫెన్సింగ్ కార్యక్రమానికి సహకరించారు. ఇదిలా ఉంటే అక్కడ పాత లేఔట్‌లోని ప్లాట్ల యజమానులు సంబురాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్లను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్కడి ప్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్లారు. మధ్యలో ఎం.ముఖీం వచ్చి అన్యాయంగా ఆ భూములను తెగనమ్ముకోవడానికి ప్రయత్నించాడని, ఇన్నాళ్లకు ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకట్ట వేసిందిని హర్హం వ్యక్తం చేశారు.

ముఖీం గెస్ట్‌హౌజ్‌తో పాటు.. ఫామ్‌హౌజ్ నేలమట్టం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూరంలోని సర్వే నంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయరాదని 1998లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఏ మాత్రం లెక్కచేయకుండా 2006లో ఎం ఏ ముఖీం గెస్ట్‌హౌజ్ కట్టుకున్నాడు. దీంతోపాటు మొత్తం 40 ఎకరాల పరిధిలో ఫామ్‌హౌజ్ నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హద్దులు పెట్టాడు. ఇక అటువైపు కన్నెత్త్తి చూడటానికి కూడా అవకాశం లేకుండా కాపాలా పెట్టాడు. ఇక్కడితో ఆగకుండా అక్కడి భూములను తెగనమ్మడం ప్రారంభించాడు. దీంతో అక్కడి లే ఔట్‌లో ఉన్నవారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని ఇరుపక్షాలకూ 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను పట్టించు కోకుండా.. 2.20 ఎకరాలలో ముఖీం సోదరుడు ఎంఏ అజీం నిర్మించిన

6 అంతస్థుల అపార్టుమెంట్‌ను హైడ్రా కూల్చేసింది. స్విమ్మింగ్‌ఫూల్‌తో సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్ట్‌హౌజ్‌తో పాటు అక్కడ నిర్మించిన ఇంటిని, ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్‌హౌజ్‌ను, గుర్రాల కోసం నిర్మించిన శాలలను తొలగించారు. కోర్టు తీర్పులు పెండింగ్‌లో ఉండగా ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖీంతో పాటు అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలను చేస్తుండటాన్ని ప్రభుత్వం సిరియస్‌గా పరిగణించింది. అధికారులను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి అక్కడ లావాదేవీలు నిర్వహిస్తున్న ముఖీం కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకు ఫెన్సింగ్ వేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది.