Reading Time: < 1 minute

 ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పే పోలీసులే ఉల్లంఘిస్తే…రూల్స్ నగరవాసులకే తప్ప తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తే…తామేమి చేసినా అడిగేవారు లేనట్లుగా నిబంధనలు ఉల్లంఘించడంపై నగర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూల్ పెడుతాం కానీ పాటించం అన్నట్లుగా పోలీసుల తీరుపై సర్వత్రా గుర్రుమంటున్నారు. హెల్మెట్ లేకున్నా, రాంగ్‌రూట్‌లో వెళ్లినా కొరడా జులిపిస్తున్న పోలీసులు తమవారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ వాహనాలతో రాంగ్ రూట్‌లో వెళ్తు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు సాధారణ ప్రజలకు తప్ప తమకు వర్తించవని భావిస్తున్నట్లు ఉంది వారి వ్యవహారం. బండ్లగూడ జాగీర్, కాళీమందిర్ సమీపంలో టిఎస్ 09 పిఏ 2126 టాటా సుమో వాహనం రాంగ్ రూట్‌లో వెళ్లింది. ఎదురుగా వాహనాలు వారి దారిలో వస్తున్నా కూడా పోలీస్ వాహనం ఎదురుగా రాంగ్ రూట్‌లో వెళ్లింది. యూటర్న్ చాలా దూరం ఉండడంతో అంతదూరం ఎవరు తిరిగి వస్తారని, రాంగ్ రూట్‌లో వెళ్లాడు.