Reading Time: < 1 minute

మరణం ఎప్పుడూ

ఒక వీలునామా కాదు

ఏ పిరికితనమూ మరణ కాంక్షకి

శాశ్వత చిరునామా కాదు

అనేక భావోద్వేగాల మధ్య

తీవ్ర అంతర్గత ఒత్తిళ్ల మధ్య

అప్రయత్నంగా ఎవరైనా

తమ జీవితానికి తామే ఉరిశిక్ష వేసుకుంటే

అది కేవలం ఆత్మహత్యా సదృశ్యమే కాదు

చట్ట విరుద్ధమైన చర్య కూడా

ఈ చావు భయం శారీరకమే కాదు

అంతర్గతమూ కూడా

మృత్యువు పేరుతో సమాజానికి వేసిన

ఒక సామూహిక ప్రశ్న, ఓ నిశ్శబ్ద నిష్క్రమణ

ఒక్క క్షణం జీవితంలో ఓడిపోతే చాలు

దానికి శాశ్వత పరిష్కారం

మృత్యువు రూపంలో తొంగి చూస్తోంది

అపురూపంగా పెంచుకున్న ఈ ఆయుష్షు

ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడమంటే

అది ఓ ప్రచ్ఛన్న అంతర్గత యుద్ధమే

ప్రతి సమస్యకీ మరణమే

ఓ శాశ్వత పరిష్కారమైతే ఈ లోకంలో

ఏ జీవీప్రాణాలతో బతికి బట్టకట్టదు

ఓటమి భయంతో ఆత్మవిశ్వానికి దూరమౌతుంటే

విరిగిన మనసుకు మరణం వీలునామా కాదు

అది ఓ తాత్కాలిక, శాశ్వత విరామం మాత్రమే

రేపటి మీద ఆశతో బతకాలంటే

ఇవాళ్టి మీద భరోసాతో ముందడుగు వెయ్యడమే

మనిషికి చిరకాల స్వప్నం

ఈ నమ్మకంతోనే కాలాన్ని బతికిద్దాం

బతికినంత కాలంఓ చైతన్య జ్యోతిగా

వెలిగి నిలిచిపోదాం

– ఎన్.లహరి