Reading Time: 2 minutes
Budget International Trips For Indian Travelers

Budget International Trips: సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే మనకు యూరప్ లేదా అమెరికా వంటి ఖరీదైన దేశాలే గుర్తొస్తాయి. కానీ మన పొరుగు దేశాల్లోనే ప్రపంచస్థాయి అందాలు కొలువుదీరాయని మీకు తెలుసా. నేపాల్‌లోని మంచు శిఖరాలు, భూటాన్‌లోని ప్రశాంతత, శ్రీలంకలోని నీలి సముద్ర తీరాలు.. ఏ దేశానికైనా పోటీనివ్వగలవు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అంతర్జాతీయ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ పొరుగు దేశాలు సరైన ఎంపిక అని చెబుతున్నారు. వాటి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..

నేపాల్: హిమాలయాల ఒడిలో..
భారతీయులకు అత్యంత పొరుగు దేశం నేపాల్. ఇక్కడికి ఫ్లైట్‌లోనే కాకుండా బస్సులో కూడా వెళ్లవచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడే ఉంది. ప్రకృతి ప్రేమికులకు కాట్మండు, పోఖ్రా, లుంబినీ ప్రాంతాలు అద్భుతమైన అనుభూతినిస్తాయి. నిజానికి ఈ దేశానికి వెళ్లాలంటే భారతీయులకు వీసా అవసరం లేదు. కేవలం ఓటర్ ఐడి కార్డుతో కూడా నేపాల్ వెళ్లవచ్చు.

భూటాన్: ప్రకృతి ఒడిలో ప్రశాంతత
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో భూటాన్ ఒకటి. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వెళ్తే ఆ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. తూర్పు హిమాలయ పర్వతాలు, పచ్చని అడవులు, సాంప్రదాయ ఇళ్లు ఇక్కడి ప్రత్యేకత. పారో, థింపూ, పునాఖా ఇక్కడ తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ఈ దేశానికి భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్నప్పటికీ, ఎంట్రీ పర్మిట్ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫీజు’ (SDF) చెల్లించాల్సి ఉంటుంది.

మయన్మార్: సంస్కృతుల సమ్మేళనం
భారతదేశ ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరంలకు ఆనుకుని ఉండే మయన్మార్, ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. యాంగూన్, బగాన్, ఇన్లే లేక్ వంటి ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడికి ఫ్లైట్ లేదా బస్సులో వెళ్లే సౌకర్యం కూడా ఉంది. భారతీయులు ఇ – వీసా (e-Visa) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

శ్రీలంక: నీలి సముద్ర తీరం
దక్షిణ భారతానికి అతి సమీపంలో ఉండే ద్వీప దేశం శ్రీలంక. రామేశ్వరం నుంచి మన్నార్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తే సముద్ర జీవుల వైవిధ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. విమానాలతో పాటు దక్షిణ భారతం నుంచి క్రూయిజ్ షిప్‌ల ద్వారా కూడా ఇక్కడికి వెళ్లవచ్చు. సిగిరియా, క్యాండీ, నువారా ఎలియా ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రాంతాలు. ఈ దేశానికి వెళ్లడానికి భారతీయులకు ETA (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) అవసరం. తరచుగా శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు ఉచిత వీసా లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం కల్పిస్తుంటుంది. ప్రయాణానికి ముందు ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ ఖర్చు పెట్టకుండా, తక్కువ రోజుల్లో విదేశీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ నాలుగు దేశాలు బెస్ట్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయి.

READ ALSO: X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..