Reading Time: < 1 minute

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు ఘాటైన విమర్శలతో ముప్పెట దాడి ప్రారంభించారు.బిఆర్‌ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం, కానీ ప్రస్తుత ప్రభుత్వం పోయి కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని అంటున్నారని ఆయన శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కెసిఆర్ మళ్లీ ఎందుకు సిఎం కావాలో జీవన్ రెడ్డి సరైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని హరీష్ రావు, కెటిఆర్ చూడలేకపోతున్నారని, అందుకే ప్రతి రోజూ తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన విమర్శించారు. వారి శాపనార్ధాలే మా ప్రభుత్వానికి దీవెనలని ఆయన తెలిపారు. గతంలో కూడా డి. శ్రీనివాస్ ఇలాగే మోసపోయారని, ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యని ఇలాగే మోసం చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇవన్నీ గమనించి మీరు ఎక్కడున్నా మీ వ్యక్తిత్వాన్ని, మీ సిద్ధాంతాలను కాపాడుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా జీవన్ రెడ్డి నిబద్ధతతో పని చేశారని, పెత్తందారి వ్యవస్థకు దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశారని, మీ నాన్న కూడా దొరల గడీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఉన్నారని చెబుతుంటారని ఆయన తెలిపారు. అత్యంత సాధారణంగా మీరు జీవించారని, కాంగ్రెస్ విధానం కూడా సెక్యులరిజం, సోషలిజం, ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్ ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఈ మూల సిద్ధాంతాలకు అనుకూలంగా మీరు ఒక వ్యక్తిగా పెరిగి.. కాంగ్రెస్ పార్టీకి మీకు ఒక గుర్తింపును తీసుకొచ్చారని, అటువంటి మీరు.. ఇటీవల రాజ్యసభకు వెళ్లే అవకాశం రాలేదని కాంగ్రెస్ పార్టీని విడిచి.. రాజకీయ శత్రువైన బిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం బాధగా ఉందని డాక్టర్ మల్లు రవి అన్నారు.