Reading Time: < 1 minute

పూలేకు నివాళులే కాదు.. పూలే ఆశయం కోసం ప్రధాని పాటుపడాలి

బిసి మహిళ సబ్ కోటా కై ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళల ధర్నా

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల ఐకాన్ మహాత్మ జ్యోతిబా పూలే 200 జయంతి సందర్భంగా మొదటి సారిగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభినందనీయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పూలే ఆశయాలు అమలు చేయడానికి ప్రధాని మోడీ పాటుపడాలని ఆయన కోరారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కంటే ముందు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఈ విషయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లుపై గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరించకుండా బిసి కోటపై తమ రాజకీయ విధానాన్ని ప్రకటించి 16 న జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిసి మహిళల సబ్ కోట కోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బిసి మహిళలకు వాటా కల్పించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగా ఈ నెల 13న అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని, ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళలచే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.