Reading Time: 2 minutes
Asha Bhosle Heart Attack Hospitalized Mumbai Breach Candy Updates

Asha Bhosle: ఇండియన్ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర వైద్య విభాగం (ICU)లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

READ ALSO: Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. ఆశా భోస్లే ప్రముఖ వైద్యుడు ప్రతి సంధానీ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆశా భోస్లే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు. ఈ వార్త తెలియడంతో ఆమె త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. దివంగత గాయని లతా మంగేష్కర్ సోదరిగా మ్యూజిక్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే, తనదైన శైలితో సొంత ముద్ర వేసుకున్నారు. 1950వ దశకంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె, వేల సంఖ్యలో పాటలు పాడారు. 1952లో ‘సంగ్దిల్’ చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె, ఆ తర్వాత ‘పరిణీత’, ‘బూట్ పాలిష్’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల దృష్టిని ఆకర్షించారు.

మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్. ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి డ్యాన్స్ నంబర్లతో ఆమె అప్పట్లోనే సంచలనం సృష్టించారు. ఆశా భోస్లే కేవలం కమర్షియల్ పాటలకే పరిమితం కాలేదు. గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 90వ దశకంలో ‘రంగీలా’ చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆమె, ఇటీవలే 91 ఏళ్ల వయసులో దుబాయ్ కచేరీలో “తౌబా తౌబా” వంటి ట్రెండింగ్ సాంగ్స్ పాడి ‘జెన్ జీ’ (Gen Z) మనసులను కూడా గెలుచుకున్నారు. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందిన ఆశా భోస్లే మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఆస్పత్రి నుంచి బయటికి రావాలని ఆమె అభిమానులందరూ కోరుకుంటున్నారు.

READ ALSO: Peanut Chikki: వంటరాని వారు కూడా ‘సింపుల్’గా చేసే పర్ఫెక్ట్ పల్లిపట్టి.. ఇలా చేయండి!