Reading Time: 2 minutes
Telangana Inter Results 2026 Parenting Tips Students Mental Health

Parenting Tips: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడదలయ్యాయి.. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫలితాలు శాతం పెరిగింది.. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఫలితాలు చూడగానే ఇళ్లలోని తల్లిదండ్రులు, సమాజంలోని వ్యక్తులు సూటిపోటి మాటలు అంటుంటారు. తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యారని నిందిస్తుంటారు. ఇది చాలా తప్పు. కేవలం మార్కులు మాత్రమే పిల్లల భవిష్యత్తును నిర్ణయించలేవు. విద్యార్థులు కూడా ఫలితాలపై చింతించకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి.

READ MORE: Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది

తల్లిదండ్రులకు కీలక సూచనలు…
పిల్లలు ఎన్ని మార్కులు సాధించినా, వారు మీ బిడ్డలే. వారికి ఈ టైమ్‌లో భరోసా ఇవ్వండి.. తిట్టకండి. పక్కింటి పిల్లలతో లేదా బంధువుల పిల్లలతో మీ పిల్లలను పోల్చడం ఆపండి. ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. ఒక పరీక్షలో తప్పడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదు. అది కేవలం ఒక చిన్న అడ్డంకి మాత్రమే అని గుర్తుంచుకోండి. మీ పిల్లలకు ధైర్యం చెప్పండి. ముందు తిట్టడం మానేసి పిల్లలు ఎందుకు తక్కువ మార్కులు తెచ్చుకున్నారో లేదా వారి బాధ ఏమిటో ప్రశాంతంగా అడిగి తెలుసుకోండి. వారి బాధను వ్యక్త పరచనివ్వండి. ఇప్పటికే పిల్లలు బాధలో ఉంటారు. ఈ సమయంలో కఠినంగా ప్రవర్తిస్తే మరింత కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.”నేనున్నాను.. చూసుకుందాం” అనే చిన్న మాట వారిలో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మార్కులు తక్కువ వస్తే రీ-కౌంటింగ్ లేదా ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉందని సానుకూలంగా చెప్పండి. చదువులో వెనుకబడి ఆ తర్వాత ప్రపంచాన్ని శాసించిన గొప్ప వ్యక్తుల గురించి వివరించండి. బిడ్డ మౌనంగా ఉన్నా, ఆహారం తీసుకోకపోయినా, గదిలోనే ఒంటరిగా ఉన్నా వెంటనే స్పందించి ప్రేమగా దగ్గరకు తీసుకోండి. చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అనే భయంతో పిల్లలపై కోపం చూపకండి. సమాజం కంటే మీ బిడ్డ ప్రాణం ముఖ్యం. ఎక్కడ తప్పు జరిగిందో ప్రశాంతంగా కూర్చుని చర్చించి, వచ్చేసారి ఎలా మెరుగుపరుచుకోవాలో ప్రణాళిక వేయండి. చివరిగా మీ ఫలితాలు వచ్చిన మొదటి రెండు మూడు రోజులు పిల్లలను అస్సలు ఒంటరిగా వదలకండి. వారితో కలిసి ఉండండి.