
న్యూఢిల్లీ: దేశంలో 2029 నాటికి చట్టసభలలో మహిళా రిజర్వేషన్ కోటా అమలులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కీలక పార్టీలు ఒకేతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కేంద్రంతలపెట్టిన రాజ్యాంగ సవరణలకు, చట్టం రూపకల్పనకు అంతా ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ, లోక్‌సభలలోని పలు పార్టీల సభాపక్ష నేతలకు లేఖలు రాశారు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పొడిగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణల ఆమోదానికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ మూడు రోజుల ప్రత్యేక సిట్టింగ్‌ను ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఉభయ సభల ఫ్లోర్ లీడర్స్‌కు లేఖలు పంపించినట్లు అధికారికంగా వెల్లడైంది. చట్టసభల పరిపూర్ణత దిశలో రిజర్వేషన్ల కోటా అమలుకు సంకల్పించినట్లు ప్రధాని పేర్కొన్నారు.
2029 లోక్‌సభ ఎన్నికలు, అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలు మహిళా కోటా అమలు తోనే నిర్వహించాల్సిన అవసరం ఉందని , ఈ విషయాన్ని పార్టీల నేతలంతా గుర్తించాలని, ఈ విషయంలో సభలో ఐక్యత చాటుకోవల్సి ఉందన్నారు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థ మరింత పరిపుష్టం అయి తీరాలి. మహిళలకు పరిపాలనలో మరింత ప్రాతినిధ్యం తలెత్తాలని ఈ లేఖలలో పేర్కొన్నారు నారీ శక్తి వందన్ అధినియం సాకారం కీలక మలుపు అవుతుందన్నారు. రాజ్యాంగ సవరణల మేరకు రూపొందే చట్టంతో లోక్‌సభలో, అసెంబ్లీలో మహిళలకు 33శాతం స్థానాలకు వీలేర్పడుతుంది. 2023లోనే ఈ మేరకు సవరణలు అమలులోకి వచ్చాయి. అయితే 2027 జనగణన ప్రాతిపదికన జరిగే డిలిమిటేషన్ పూర్తి తరువాతనే కోటా అమలులోకి వస్తుంది. అప్పటి చట్టం అమలులో ఉంటే రిజర్వేషన్ల కోటా అమలు 2534కు ముందు అసాధ్యం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని దీనికి ఇప్పుడు సవరణలు చేపట్టారు. ఈ ప్రక్రియతో లోక్‌సభ బలం 816కు చేరుతుంది. ఇందులో కోటా మేరకు మహిళలకు 273 స్థానాలు కల్పించాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలక పరిణామం అవుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. డిలిమిటేషన్ ప్రక్రియలోని అంశాలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
నేడు ఢిల్లీలో జాతీయ స్థాయి మహిళా సదస్సుకు ప్రధాని
మహిళా రిజర్వేషన్ల కోటా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జాతీయ స్థాయి మహిళా సదస్సు జరుగుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ముందు జరిగే నారీ శక్తి వందన్ సమ్మేళన్‌కు ప్రధాని మోడీ హాజరవుతారు. దేశ భవిష్యత్తు రూపకల్పన, వికసిత భారత్ 2047 లక్ష సాధనలో మహిళలకు ఇతోధిక ప్రాతినిధ్యం, నిర్ణయాథికారాలలో వారికి ప్రాధాన్యత వంటి విషయాలపై విశ్లేషణకు ఈ జాతీయ సదస్సును తలపెట్టారు.