
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల ఫుట్‌పాత్ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విస్తరిస్తున్న నగరానికి తగ్గట్టుగా రహదారులు లేకపోవడంతోపాటు భారీగా వాహనాల పెరుగుదలతో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగర ప్రజలు రద్దీ సమయాల్లో రోడ్లపై నడవాలంటేనే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉన్న కొన్ని ఫుట్‌పాత్‌లను కూడా చిరు, బడా వ్యాపారస్థులు కబ్జాలు చేయడంతో ఏమీ చేయలేక రోడ్డుపైనే నడుస్తూ ప్రయాణికులు ప్రమాదాలకు గురైన ఘటనలు నగరంలో అనేకం ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం నగరం నలువైపులా ఫుట్‌పాత్‌లపై అక్రమ కట్టడాల తొలగింపుకు నడుం కట్టడంతో ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. రాజకీయంగా, అధికారికంగా ఏ రూపంలోనైనా ఒత్తిడిలు వచ్చినా కబ్జాదారుల కబంధహస్తాల నుండి ఫుట్‌పాత్‌లను విముక్తి చేయాలి. వేగంగా అభివృద్ధి చెందుతూ మెట్రో నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ ఐటి, మౌలిక వసతులు, రహదారుల విస్తరణలో ముందంజలో ఉన్నా ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నాయి.
అభివృద్ధిలో భాగంగా వాహనాలకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత కాలమానంలో మనుషుల అవసరాలను తీర్చడంలో వెనుకబడి పోతున్నామని చెప్పడానికి నగరంలో ఫుట్‌పాత్ నిర్వహణనే నిదర్శనం. జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు తొమ్మిది వేల కిలోమీటర్లకుపైగా రోడ్డు నెట్‌వర్క్ ఉంది. అయితే అందులో ఫుట్‌పాత్‌లు వెయ్యి కిలోమీటర్ల లోపలే ఉన్నాయి. అంటే దాదాపు 60శాతం రోడ్లకు ఫుట్‌ఫాత్‌లు లేవు. ఉన్న చోట్ల కూడా అవి పూర్తిగా వినియోగించుకునే స్థితి లేవు. ఫుట్‌పాత్‌ల సమస్యలో ప్రధాన కారణం ఆక్రమణలే. రోడ్డు పక్కన వ్యాపారులు, షాపుల విస్తరణలు, వాహనాల పార్కింగ్ వంటి కారణాలతో ఫుట్‌పాత్‌లు కబ్జా అవుతున్నాయి. పాదచారులకోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లు వాణిజ్య కార్యకలాపాల కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో నగర ప్రజలు తప్పని పరిస్థితుల్లో రహదారులపైనే నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
దీంతో వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా వృ ద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో నడక ప్రమాదకరంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్‌లో వెయ్యికిపైగా పాదచారుల ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2024 గణాంకాలు పరిశీలిస్తే 400 మంది పాదచారులు ప్రమాదంలో మృతి చెందారు. 775 మంది గాయపడ్డారు. అంటే నగరంలో రోజుకు సుమారు 30 మందికిపైగా పాదచారులు రోడ్డు ప్రమాదాల బారీనపడుతున్నారు. ఈ ప్రమాదాలు అత్యధికంగా ఫుట్‌పాత్ సమస్యలతో ముడిపడి ఉండడం గమనార్హం. నగరంలో రహదారుల, ఫుట్‌పాత్ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా వాటిని అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు మూడు వేల కోట్లకుపైగా రూపాయలు వెచ్చించి వెయ్యి కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా బిటి, సిసి రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌లు, సెంట్ల్ మీడియన్లు, సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 700 కిలోమీటర్లకుపైగా రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు, అదనంగా 200 కిలోమీటర్లకుపైగా రోడ్లను ఎఫ్‌డిఆర్ సాంకేతికతతో పునర్నిర్మాణం చేయనున్నారు. వీటితోపాటు నగరం మొత్తం ఫుట్‌పాత్‌లను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి 2025 -26లో గుంతలు పూడ్చడంతోపాటు ట్రాఫిక్ భద్రతా చర్యలను చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు 24 లింక్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 487 కోట్ల ప్రణాళికను అమలు చేస్తున్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కట్టడాలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధ్దమైన జిహెచ్‌ఎంసి ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా నగరం నలువైపులా అక్రమ కట్టడాలను తొలగించేందుకు ముందుకొచ్చిన జిహెచ్‌ఎంసి ఏప్రిల్ 4వ తేదీన హైడ్రా, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకొని ఆరు జోన్ల్ పరిధిలోని 798 నిర్మాణాలను నేలమట్టం చేసింది. తొలగించిన వాటిలో 340 పూర్తిస్థాయి, 458 తాత్కాలిక నిర్మాణాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సున్నితమైన పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నా అధికారులు సమన్వయంతో విజయవంతంగా అక్రమాలను తొలగించారు. ఇదే తరహాలో ఇకపై నగరవ్యాప్తంగా ప్రతివారం ఏదో ఒక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగర ప్రజలు ఇదే కోరుకుంటున్నారు.
చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు పలు సమస్యలకు కారణాలవుతున్నాయి. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే చార్మినార్ పరిసరాల్లో వ్యాపారస్థులు పూర్తిగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పర్యాటకులు నడవలేని పరిస్థితి నెలకొంది. దక్షిణ హైదరాబాద్‌కు ముఖద్వారమయిన మూసీనదిపై నాటి నిజాం కాలంలో నిర్మించిన వంతెన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ప్రస్తుతం పాతబస్తీలో మూసీ నదిపై ఉన్న వంతెనలన్నింటిలో ‘నయాపూల్’గా పిలువబడే వంతెన ఎత్తైనది. భారీ వాహనాల ప్రయాణానికి అనువుగా నిర్మించిన ఈ వంతెనపై రిక్షాలు, సైకిళ్ల కోసం, పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 2000 సంవత్సరం వరకు ఇదే తరహాలో ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు భారీ వాహనాల మార్గం మినహాయించి రిక్షాలు, సైకిళ్లు, పాదచారులకోసం ఏర్పాటు చేసిన మార్గాలు పూర్తిగా తోపుడు బండ్లతో నిండిపోతున్నాయి. అక్కడ పాదచారులు భారీ వాహనాలు నడిచే మార్గంలోనే నడవాల్సి ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
ఇదే మార్గంలో ముందుకెళ్తే చారిత్రాత్మక కట్టడాలున్న మదీనా, గుల్జర్‌హౌజ్, చార్మినార్ మరింత క్లిష్ట పరిస్థితులున్నాయి. పాతబస్తీలోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్, కోఠి, నాంపల్లి, చిక్కడిపల్లి, మెహిదీపట్నం, ఆరాంఘర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ వంటి పలు ప్రధాన మార్గాల్లో ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించకుండా ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిలో తప్పు చేస్తున్నామనే స్పందనలేకపోవడం, రాజకీయ ప్రయోజనాలతో వారికి మద్దతుగా నేతలు బలప్రదర్శన చేస్తూ అధికారులను అడ్డుకోవడం దురదృష్టకరం. ఇటీవల నగరంలోని ఆరు జోన్లలో అక్రమాలను తొలగిస్తుంటే పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా అధికారులు వెనక్కి తగ్గకుండా పని పూర్తిచేయడం అభినందనీయం.
ఎంతోకాలంగా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, వారందరూ చిరు వ్యాపారులు అంటూ ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారికి మద్దతుగా నిలిచే వారు వాదిస్తున్నారు. దీర్ఘకాలికంగా వారక్కడ ఆక్రమించి ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారనే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుందనే వాస్తవాన్ని వారు గ్రహించాలి. చిరువ్యాపారుల జీనవోపాధి దెబ్బతినడం బాధాకరమే. ఇలాంటి వారి కోసం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రత్యామ్నాయం ఆలోచించి చర్యలు తీసుకోవాలి. మరోవైపు ప్రధాన కూడళ్లలో బడా వ్యాపారస్థులు కూడా తమ దుకాణాలకు ముందున్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రదేశాలు నగరంలో కోకొల్లలు. మరికొన్ని చోట్ల పెద్ద వ్యాపారస్థులే వారి మనుషులతో ఫుట్‌పాత్‌లను ఆక్రమింపజేసి వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వాస్తవాలు ఇలా ఉంటే చిరువ్యాపారులకు అన్యాయం జరుగుతుందంటూ రాజకీయ నేతలు అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజలను ఇబ్బందుల పాలుజేయడమే.
విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి అనుగుణంగా రహదారులు, ఫుట్‌పాత్ అభివృద్ధి కోసం ఆలస్యంగానైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై కబ్జాల తొలగింపు కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేసి చేతులు దులుపుకోకుండా ఆ అక్రమ కట్టడాలపై పర్యవేక్షణ నిత్యం కొనసాగాలి. తొలగించిన కట్టడాలను పాతబస్తీ వంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగి నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని అరికడితేనే ప్రభుత్వ లక్ష్యం సఫలమవుతుంది. ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా పాతబస్తీతో సహా నగరంలోని నలుమూలల రహదారులపై అక్రమంగా వెలిసిన కట్టడాలన్నింటినీ తొలగించాలని నగరవాసులు అందరూ కోరుకుంటున్నారు. ఆక్రమణల తొలగింపుతో గ్రేటర్ రహదారులకు మహర్దశ ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. ఇలాంటి బహత్కరమైన కార్యమ్రాలను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కొనసాగిస్తే కబ్జాదారులు మరోసారి అక్రమాలు చేయడానికి సాహసించరు.
– ఐ.వి.మురళీకృష్ణ