
ప్రథమ సంవత్సరంలో 74.40 శాతం,
ద్వితీయ సంవత్సరంలో 78.65 శాతం
ఉత్తీర్ణతతో ముందంజలో బాలికలు
ఫస్టియర్‌లో 3,23,807 మంది,
సెకండియర్‌లో 3,58,490 మంది ఉత్తీర్ణత
– మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ,
మే 22 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
– ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన
ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడులయ్యాయి. ఈసారి ఫలితాల్లోనూ మళ్లీ బాలికలే ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 9.97 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,23,807 మంది ఉత్తీర్థత సాధించారు. ఫస్టియర్‌లో 66.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 5,07,948 మంది పరీక్షలు రాయగా, 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్‌లో 1,92,589 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 65,480 మంది బి గ్రేడ్, 27,476 సి గ్రేడ్, 10,235 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్‌లో 17,791 మంది మంది విద్యార్థులు ఎ గ్రేడ్, 9,616 మంది బి గ్రేడ్, 586 మంది సి గ్రేడ్, 34 మంది డి గ్రేడ్ సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 2,13,179 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా,25 మంది ప్రైవేట్ విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించారు. రెగ్యులర్‌లో 69,641 మంది, ప్రైవేట్‌లో 11 మంది బి గ్రేడ్, రెగ్యులర్‌లో 22,862 మంది, ప్రైవేట్‌లో ఆరుగురు సి గ్రేడ్, రెగ్యులర్‌లో 5,430 మంది, ప్రైవేట్‌లో నలుగురు డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్ రెగ్యులర్‌లో 20,099 మంది ఎ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్‌లో 10,305 మంది, సి గ్రేడ్‌లో రెగ్యులర్‌లో 450, డి గ్రేడ్‌లో రెగ్యులర్‌లో 18 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు ఇంటర్మీడియేట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ,ఇంటర్మీడియేట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ తరుఫున అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందని పేర్కొన్నారు.
బాలికలదే పైచేయి
ఇంటర్ ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 66.20 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 74.40 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 70.58 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం నమోదైంది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,24,436 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 1,67,045 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 24,674 మంది బాలికలు హాజరు కాగా, 18,286 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,17,427 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 1,28,734 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 22,586 మంది హాజరుకాగా, 9,741 మంది ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 2,12,930 మంది బాలికలు హాజరు కాగా, 1,74,136 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేట్‌లో 17,921 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 6,191 మంది ఉత్తీర్ణులయ్యారు.
పెరిగిన ఉత్తీర్ణత
ఇంటర్మీడియేట్ ఫలితాలలో గత ఐదేళ్లతో పోల్చితే ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2022లో ప్రథమ సంవత్సరంలో 64.86 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2023లో 62.85 శాతం, 2024లో 61.08 శాతం, 2025లో 66.91 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఏడాది గత ఐదేళ్ల కంటే అధికంగా 66.94 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2022లో 68.68 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2023లో 67.27 శాతం, 2024లో 69.49 శాతం, 2025లో 71.43 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సెకండియర్‌లో కూడా ఈ ఏడాది గత ఐదేళ్ల కంటే అధికంగా 75.61 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది.
ఇంటర్ ఫలితాల్లో టాప్‌లో మేడ్చల్
రాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొదటి మూడు జిల్లాలు మేడ్చల్ 77.31 శాతం, రంగారెడ్డి 76.38 శాతం, జయశంకర్ భూపాలపల్లి 73.04 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చివరి మూడు జిల్లాలు కామారెడ్డి 49.40 శాతం, మహబూబాబాద్ 49.11 శాతం, రాజన్న సిరిసిల్ల 49.05 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొదటి మూడు జిల్లాలు వరుసగా మేడ్చల్ 82.73 శాతం, జయశంకర్ భూపాలపల్లి 82.34 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్ 82.16 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చివరి మూడు జిల్లాలు ఆదిలాబాద్ 62.50 శాతం, వరంగల్ 60.80 శాతం, రాజన్న సిరిసిల్ల 58.69 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఎంపిసిలో అత్యధిక ఉత్తీర్ణత నమోదు
ఇంటర్మీయేట్ ఫలితాలలో గ్రూపుల వారీగా ఎంపిసి ఫస్టియర్‌లో 75.51 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఎంఇసిలో 64.07 శాతం, బైపిసిలో 72.39 శాతం, సిఇసిలో 44.90 శాతం, హెచ్‌ఇసిలో 34.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండియర్ ఎంపిసిలో 78.01 శాతం,ఎంఇసిలో 67.91 శాతం, బైపిసిలో 76.04 శాతం, సిఇసిలో 49.39 శాతం, హెచ్‌ఇసిలో 49.25 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.
మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రకటించారు.మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని అన్నారు. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తామని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులు సోమవారం నుంచే ప్రారంభం అవుతాయని, ఏప్రిల్ 20 చివరి తేదీ అని వెల్లడించారు. రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించాలని పేర్కొన్నారు.
వాట్సాప్‌లోనూ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను ఈసారి వాట్సాప్‌లోనూ చూసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు స్మార్ట్‌ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకొని, ఆ నెంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఉత్తీర్ణత శాతం ఇలా..
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 66.20 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ రెండో సంవత్సరంలో 70.58 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 74.40
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 57.69
ఇంటర్ రెండో సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 78.65
ఇంటర్ రెండో సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 62.50
సెకండియర్‌లో మేడ్చల్‌లో జిల్లాలో అత్యధికంగా 82.73 శాతం ఉత్తీర్ణత
సెకండియర్‌లో అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 58.69 శాతం ఉత్తీర్ణత
ఫస్టియర్‌లో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 77.31 శాతం ఉత్తీర్ణత
ఫస్టియర్‌లో అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 49.05 శాతం ఉత్తీర్ణత