Reading Time: < 1 minute
Trump Warns China Iran Military Aid 50 Percent Tariff Hormuz Blockade

Trump Warns China: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం లేదా ఆయుధాలు సరఫరా చేస్తే చైనా వస్తువులపై 50 శాతం భారీ టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన తాజాగా హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..
ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని ఆయన అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. “అమెరికా నౌకాదళం తక్షణమే హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా వెలుపలికి వచ్చే నౌకలను అడ్డుకుంటుంది. శాంతియుత నౌకలపై దాడి చేసే ఇరాన్ బలగాలను తుత్తునియలు చేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు. ఇదే సమయంలో ట్రంప్.. చైనాకు ఆఫర్ ఇచ్చారు. ఇరాన్ నుంచి చమురు కొనడానికి బదులు, అమెరికా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. “చైనా తన నౌకలను వెనిజులాకు పంపవచ్చు. మా వద్ద అపారమైన నిల్వలు ఉన్నాయి. ఇరాన్ కంటే తక్కువ ధరకే మేము చమురును సరఫరా చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ నేతృత్వంలో ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయడానికి అంగీకరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వాన్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చైనాను హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వచ్చే నెలలో ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

READ ALSO: Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!