Reading Time: 2 minutes

తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు

మనతెలంగాణ / సిటిబ్యూరోః మహానగరంలో మళ్లీ దొంగలు రెచ్చిపోతున్నారు, తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని వరుసగా దొంగతనాలు చేసుకుంటున్నారు. తాళం వేసిన ఇళ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసుకుని చోరీ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, బోడుప్పల్ పరిధిలోని పలు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుని వెళ్తున్నారు. గతంలో మాదిరిగానే వేసవి వచ్చిందంటే అంతరాష్ట్ర ముఠాలు నగరంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. వేసవి సెలవుల్లో చాలా మంది ఇంటికి తాళం వేసి గ్రామాలకు వెళ్లడంతో వాటిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. తాళాలు పగులగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలు,వెండి వస్తువులు, నగదును చోరీ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన తర్వాత అంతరాష్ట్ర ముఠాలు చోరీలు చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లలో నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు. కాలనీలు, కాలేజీలు, గేట్ కమ్యూనిటీలను వదలకుండా దొంగలు చోరీ చేస్తున్నారు. దొంగలు గ్రేటర్ హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇనుపరాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో దొంగలు ఎక్కడో ఒక చోట చోరీలు చేస్తున్నారు. దొంగలు మారణాయుధాలతో తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన వాస్తు నిపుణులు విఎల్‌ఎన్ కుటుంబంతోపాటు మధురానగర్‌లో ఉంటున్నారు. ఇంటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులో ఉన్న నగదు రూ.4కోట్లను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టారు. పనిమీద కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని రూ.4కోట్ల రూపాయలు, బంగారు ఆభరణాలు దొంగలు చోరీ చేశారు. వెంటనే మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాలైన కొంపల్లి, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండమూడి ఎన్‌క్లేవ్‌లో ముసుగు దొంగలు గంట వ్యవధిలోనే ఐదు ఇళ్లల్లో చోరీలు చేశారు. గంట వ్యవధిలోని ఐదు ఇళ్లల్లో చోరీ చేసి కిలో వెండి, నగదును దోచుకుని పోయారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌లోని సదాశివ ఎన్‌క్లేవ్, గేట్ కమ్యూనిటీలో చోరీ చేసి మూడు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు ఎత్తుకుని వెళ్లారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేసి 43తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. చందానగర్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి 17తులాల బంగారు ఆభరణాలు, 60తులాల వెండి వస్తువులు, నగుదును ఎత్తుకుని వెళ్లారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన పోలీసులు రూ.5.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దొంగలు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా చోరీలు చేస్తున్నారు.

అంతరాష్ట్ర ముఠాల పనా…?

మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అంతరాష్ట్ర ముఠాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కువగా చోరీలు చేసిన వారిలో అంతరాష్ట్ర ముఠాలు ఉన్నాయి. వీరిపై పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో కొంత కాలం నుంచి అంతరాష్ట్ర ముఠాలు గ్రేటర్ హైదరాబాద్ వైపు చోరీలు చేసేందుకు రావడంలేదు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని భావించిన దొంగలు ఇటువైపు వస్తే పట్టుబడతామని కొంత కాలం నుంచి దొంగతనాలకు రాకుండా ఉన్నారు. కానీ మళ్లీ శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతుండడంపై పోలీసులు అంతరాష్ట్ర ముఠాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు సిటీ మధ్యలో కాకుండా శివారు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో చోరీ చేసే సులభంగా ఇక్కడి నుంచి తప్పించుకుని పోవచ్చని అంతరాష్ట్ర ముఠాలు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు చేస్తుంటారు.

పెట్రోలింగ్ పెంచాలి..

పోలీసుల నిఘా తగ్గడంతోనే దొంగలు రెచ్చి పోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, కాలనీల్లోకి వచ్చిన వారిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు. దొంగతనాలు జరగడంలేదని పోలీసులు కొంత నిర్లక్షంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. దొంగలపై పోలీసులు మరింత దృష్టి సారించి చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతరాష్ట్ర ముఠాలపై మరింత నిఘా పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వేసవి దొంగలు వచ్చారా…

వివిధ రాష్ట్రాలకు చెందిన దొంగలు వేసవి కాలంలో నగరంలో చోరీలు చేసేందుకు వస్తుంటారు. ఎక్కువగా నగరవాసులు వేసవి సెలవులకు గ్రామాలకు వెళ్తారని భావించి చోరీలు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ముందుగా దొంగలు నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.