
జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. శనివారం నందిగామ సమీపంలోని కీసర టోల్‌గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన శ్రీనివాసరావు నాలుగు రోజుల క్రితం వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. పనులు ముగించుకుని శనివారం తన బీఎండబ్ల్యూ కారులో తిరిగి హైదరాబాద్ వస్తున్నారు.
ఈ క్రమంలోనే కీసర టోల్‌గేట్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ అక్కస్మాత్తుగా బ్రేక్ ఫెయిలైయి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారుపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. లారీ కింద పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఆయన స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరావు మరణవార్త తెలియడంతో ఎల్లారెడ్డిగూడలోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయనకు భార్య శైలజ, ఏడేండ్ల కుమార్తె భవిత ఉన్నారు. శ్రీనివాసరావు మృతిపై పలువురు న్యాయవాదులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.