Reading Time: < 1 minute

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో రచ్చ లేపిన సిఎస్‌కె.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదరహో అనిపించింది. దీంతో ఈ సీజన్‌లో తమ సత్తా ఎంటో చాటి చెప్పింది. అయితే ఈ విజయంతో ఫుల్ జోష్‌ మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి షాక్ తగిలింది. అతడిపై భారీ జరిమానా పడింది. మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్ మెయింటేన్ చేసినందుకు గాను రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఇది ఈ సీజన్‌లో సిఎస్‌కెకి తొలి తప్పిందం.

ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నితిష్ రాణాకి కూడా భారీ జరిమానా పడింది. మ్యాచ్‌లో నితీష్ రాణా ఆడనప్పటికీ.. అతను ఫీల్డ్ బయట అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆర్టికల్ 2.3 ప్రకారం.. అతని మ్యాచ్ ఫీజ్ నుంచి 25 శాతం కోత విధించడమే కాక.. కోడ్ ఆఫ్ కండెక్ట్‌ను అతిక్రమించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.

ఇక, నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. ఢిల్లీ 20 ఓవర్లలో 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్‌లో ఖాతా తెరిచింది.