
బెంగాల్ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం మమత చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. అటు ఎలాగైనా బెంగాల్ ఉట్టి కొట్టాలని బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇక ఒంటరి పోరు చేస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం చీల్చే ఓట్లు ఎవరి పుట్టి ముంచుతాయనేది తేలాల్సి ఉంది. అధికారుల బదిలీలు, ఓటర్ల జాబితా సవరణ, హామీలు, పాలనా విధానం.. చివరకు పాకిస్తాన్ కూడా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అజెండాగా మారిపోయాయి. రెండు వారాల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికలు టీఎంసీకి అగ్నిపరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో గెలిచినా.. బీజేపీ మమతను టెన్షన్ పెట్టింది. ఈసారి కూడా కాషాయ పార్టీ హడావుడి ఎక్కువగానే ఉంది. దీంతో దీదీ కూడా దీటైన కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మరోసారి బెంగాల్ కూతురు సెంటిమెంట్ ప్రయోగిస్తున్న మమత.. బలమైన సంస్థాగత పునాదులే కాపాడతాయనే నమ్మకంతో కనిపిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ పశ్చిమ బెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి టెన్షన్ పెరుగుతోంది. బెంగాల్ శాసనసభకు 294 స్థానాలకు గాను ఈ నెల 23, 29.. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. బెంగాల్‌లో గత 15 ఏళ్లుగా తృణమూల్కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. 2011లో వామ పక్ష ప్రభుత్వ పాలన అంతరించిన తర్వాత మమతా బెనర్జీ బలమైన నాయకురాలిగా ఎదిగారు. బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న దీదీకి తాజాగా పెను సవాల్ ఎదురవుతోంది. బెంగాల్‌లో ఇక తనకు ఎదురు లేదని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో.. అకస్మాత్తుగా బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 సీట్లు గెలుచుకోవడం టీఎంసీకి షాక్ ఇచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఈసారి కూడా బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 నుంచి 1977 వరకూ 30 ఏళ్ల పాటు బెంగాల్‌లో కాంగ్రెస్ పాలన కొనసాగింది. 1977లో అధికారంలోకి వచ్చిన సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయి. 2011లో వామపక్షాలను ఓడించడం ద్వారా మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అయితే మమత పాలనలో పశ్చిమ బెంగాల్ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పారిశ్రామికంగా వెనుకబడింది. నిరుద్యోగం, పేదరికం మరింతగా పెరిగాయి. వీటినే రాజకీయ అస్త్రాలుగా చేసుకుని బీజేపీ పోరాడుతోంది. మమతను సాగనంపితేనే.. బెంగాల్లో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అగ్రనేతలు ఊదరగొడుతున్నారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వంటి అవినీతి అంశాలు టీఎంసీ ప్రతిష్ఠకు సవాలుగా నిలిచాయి. ఈ సమయంలోఅసెంబ్లీ ఎన్నికలు దీదీకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈసారి ఆమెకు ప్రధాన శత్రువులు ప్రతిపక్షాలు కాదు.. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణే అని విశ్లేషకులు మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలూ అంటున్నారు.
బెంగాల్‌లో ఈ నెల 23న తొలిదశ పోలింగ్ జరగనుంది. కాగా 152 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 35,97,704 మంది ఓటర్ల భవితవ్యం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీదే ఆధారపడి ఉంది. బంగ్లాదేశీ చొరబాటు ఓటర్లే పునాదిగా నిర్మించుకున్న కంచుకోటను ఈసీ ఓటర్ల సవరణ ప్రక్రియ బలంగా కొడుతోందని టీఎంసీ భావిస్తోంది. విచారణలో ఉన్న 60.06 లక్షల మంది ఓటర్లలో ఏప్రిల్ 5 నాటికి 57 లక్షల కేసులను ఈసీ పరిష్కరించింది. ముస్లిం జనాభా అధికంగా ఉండే నార్త్ దినాజ్‌పూర్‌లోని ఒక్క గోల్పోఖర్ నియోజకవర్గంలోనే 78,475 మంది ఓటర్లు విచారణలో ఉండగా.. గిరిజన జనాభా అధికంగా ఉండే బంకురా, పురూలియా జిల్లాలను పూర్తిగా కలిపినా ఆ సంఖ్య 72,694 మాత్రమే ఉంది.
టీఎంసీకి ఈసారి ఎన్నికల గణాంకాలు ఏమాత్రం సానుకూలంగా లేవు. 2021లో 55 స్థానాల్లో టీఎంసీ 15,000 లోపు మెజారిటీతో బయటపడింది. అందులో 39 చోట్ల మెజారిటీ 10 వేల లోపే. ఒకవేళ ఏమాత్రం వ్యతిరేక పవనాలు వీచినా, ఈ 55 సీట్లు చేజారి, టీఎంసీ బలం 170కి పడిపోతుంది.2024 లోక్‌సభ లెక్కల ప్రకారం చూస్తే, అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 వేల లోపు స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాలు 69కి పెరిగాయి. మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీపూర్, మానిక్తల, రాస్ బిహారీలలో మార్జిన్ తగ్గగా.. రాజార్‌హట్-గోపాల్‌పూర్‌లో మెజారిటీ కేవలం 74 ఓట్లే. ఈ లెక్కన స్వల్ప స్వింగ్ వచ్చినా టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 146కి పడిపోయే ప్రమాదం ఉంది. ముస్లిం బెల్ట్ అయిన నార్త్ దినాజ్‌పూర్, మాల్డా, ముర్షిదాబాద్, బీర్భూమ్ లలోని 52 స్థానాలతో పాటు, సౌత్, నార్త్ 24 పరగణాలు, హౌరా జిల్లాల్లో టీఎంసీకి ఎదురులేదని చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లు దాటినా అది తమకు పెద్ద ప్రమాద హెచ్చరికేనని టీఎంసీ అంటోంది. ఇప్పిటకే మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ముందు మరో పహల్గాం దాడి జరుగుతుందా..? బీజేపీ దగ్గర దానికి సంబంధించి బ్లూప్రింట్ రెడీగా ఉంది.. అంటూ బాంబు పేల్చారు దీదీ. కోల్ కతాను టార్గెట్ చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పినా మోదీ మాట్లాడక పోవడమేంటి..? మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.. అని ప్రధాని మోదీ ఎందుకు అనలేకపోయారు. దీని ప్లానింగ్ ముందే రెడీ గా ఉందా..? ఎలక్షన్స్ ముందు మరో పహల్గాం దాడికి సిద్ధమయ్యారా..? అంటూ ఫైరయ్యారు మమత. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ ఘాటుగా స్పందించింది. మైనారిటీల ఓటు బ్యాంకు కోసమే మమతా ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని యాంటీ హిందూ పార్టీగా అభివర్ణించారు.
అయితే ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవడం, ఒత్తిళ్లను తట్టుకుని గెలవటం మమతకు కొత్త కాదు. దీనికి గత ఎన్నికల్లో మమత అవలంబించిన వ్యూహమే తిరుగులేని ఉదాహరణ. బెంగాల్‌లో జెండా పాతాలన్న ఆలోచనతో పకడ్బందీ వ్యూహం పన్నిన బీజేపీకి.. మమతా బెనర్జీ సువేందుపై పోటీకి దిగి దీటైన సవాల్ విసిరారు. దీంతో జంగల్ మహల్ అంతా తిరిగి తన ప్రభావం చూపుతారనుకున్న సువేందు.. దీదీ బరిలో నిలవడంతో.. నందిగ్రామ్‌పైనే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. దీంతో మమత ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. తన పార్టీని అధికారంలోకి తెచ్చుకుని తిరుగులేని చాణక్యం ప్రదర్శించారు. దీదీ వ్యూహాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్న బీజేపీ.. మమత ట్రాప్‌లో ఇరుక్కుపోయామని తీరిగ్గా విచారించింది. ఇక మమతకు కలిసొచ్చే మరో విషయం.. బీజేపీలో ఆమెకు దీటైన నేత లేకపోవడం. సువేందును ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగించినా.. ఆయన ఏ మాత్రం తన ప్రభావాన్ని పెంచుకోలేకపోవడం బీజేపీకి అశనిపాతమే. అందుకే ఇప్పటికీ మోడీ, అమిత్‌షానే బెంగాల్ గెలుపు బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వస్తోంది.
వామపక్షాలతో సుదీర్ఘకాలం పోరాడి.. బీజేపీతో గత దశాబ్దకాలంగా ఫైట్ చేసి.. మమత రాజకీయంగా బాగా రాటుదేలారు. బీజేపీ ఎన్నిరకాలుగా దీదీ హవాకి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నా.. ఇప్పటికీ మెజార్టీ బెంగాలీలు మమతనే సీఎంగా కోరుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. మమతపై బీజేపీ చేస్తున్న చొరబాటుదార్లకు మద్దతు లాంటి ఆరోపణల్ని నమ్ముతున్న బెంగాలీలు.. అదే సమయంలో బెంగాల్ అస్తిత్వం మమతతోనే పదిలంగా ఉంటుందని భావిస్తున్నారు. పైగా మోడీ, అమిత్‌షా మినహా బెంగాల్ బీజేపీ నేతలకు ప్రజాదరణ లేకపోవడం.. కాషాయ పార్టీని వెనక్కిలాగుతున్న అంశం. గత ఎన్నికల్లో టీఎంసీని అధికారంలోకి రాకుండా ఆపలేకపోయినా.. మమతా బెనర్జీని ఓడించగలిగింది బీజేపీ. అదే ఊఫులో ఈసారి బెంగాల్ లో అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో పనిచేస్తోంది. అమిత్‌షా ఏకంగా పదిహేను రోజుల పాట బెంగాల్ లో తిష్ట వేయడం తమకు కలిసొస్తుందని కాషాయ పార్టీ భావిస్తోంది.
పశ్చిమ్ బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కృతనిశ్చియంతో ఉన్న బీజేపీ .. ఏ అవకాశాన్ని వదులుకోరాదని భావిస్తోంది. ఇందులో భాగంగానే మహిళలు, రైతులు, యువతే లక్ష్యంగా ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఉచితాలకు తాము వ్యతిరేకమని చెప్పుకునే కమలనాథులు.. బెంగాల్‌లో మాత్రం అందుకు భిన్నంగా హామీలను గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బంగారు బెంగాల్ నిర్మాణానికి ఈ మేనిఫెస్టోను రోడ్‌మ్యాప్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. 15 ఏళ్ల టీఎంసీ పాలన బెంగాలీలకు ఓ పీడకలను మిగిల్చిందని దుయ్యబట్టారు. ఇక ఇప్పటికే బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో 90 లక్షల ఓట్లను తొలగించారని చెబుతున్నారు. ఈ తొలగింపు బీజేపీకి అనుకూలంగా జరిగిందని టీఎంసీ ఆరోపిస్తుంటే.. చొరబాటుదార్ల ఓట్లే పోయాయని బీజేపీ కౌంటరిస్తోంది.
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే, మహిళలకు ఆర్థిక సాధికారికత కల్పించేందుకు 75 లక్షల లక్‌పతి దీదీలను సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి మండలంలో కనీసం ఒక మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక సహాయ కేంద్రం కూడా ఉంటుందని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే ఏడో పే కమిషన్ అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఇక, యువతకు కూడా నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి నెలకు రూ. 3,000 భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఒకేసారి రూ. 15,000 ఆర్థిక సహాయం కూడా అందించనున్నట్లు ప్రకటించారు.
రైతుల విషయానికొస్తే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అదనంగా రూ. 3,000 ఇస్తామని, దీంతో మొత్తం సహాయం ఏడాదికి రూ. 9,000కు చేరుతుందని బీజేపీ హామీ ఇచ్చింది. రైతులు తమ పంటను తక్కువ ధరలకు అమ్ముకోవలసిన పరిస్థితి రాకుండా ఉండేందుకు, బీజేపీ ప్రభుత్వం వరికి క్వింటాల్‌కు రూ. 3,100 చొప్పున 100 శాతం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. వరి, బంగాళాదుంప, మామిడి పండించే రైతులకు సరైన విలువ లభించేలా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ చెప్పింది.
బెంగాల్‌లో అధికారం కోసం బీజేపీ ఓ ప్రత్యేక వ్యూహంతో సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా సవరణతోనే టీఎంసీ గగ్గోలు పెట్టడం, అదే సమయంలో చొరబాటుదార్లకు దీదీ అండ అంటూ బీజేపీ చేసిన ఆరోపణలు.. ఓటర్ల మనసులు తాకాయని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇక అధికారుల బదిలీలపై ఇప్పటికే మమత తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇది కూడా బీజేపీకి అనుకూలంగా జరిగిన మార్పేనని మండిపడ్డారు. ఈ సందర్భంగా నేరుగా ఈసీతో మమత తలపడటం.. తటస్థ ఓటర్లను ఆలోచనలో పడేసిందని బీజేపీ నమ్ముతోంది. గత ఎన్నికల్లో వ్యక్తుల్ని నమ్మకుని ఫలితం సాధించలేకపోయామని బలంగా నమ్ముతున్న బీజేపీ.. ఈసారి పాలనా విధానాల గురించి ఎక్కువగా మాట్లాడుతోంది. సువేందును అతిగా నమ్మితే.. ఆయన నిరాశపరచటం.. బీజేపీ వ్యూహాన్ని మార్చుకునేలా చేసింది. మమత పాలనలో బెంగాల్ వెనుకబడిందని, తాము అధికారంలోకి వస్తే.. బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని, కావాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చూడాలని కాషాయ పార్టీ బెంగాలీలను ఊరిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ క్రమంగా బలపడుతున్న బీజేపీ.. పోలింగ్ బూతుల్లో టీఎంసీతో నువ్వా నేనా అనేలా తలపడాలని చూస్తోంది.
ఇక ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీఎంసీ బెంగాల్‌లో వేర్వేరుగా పోటీ చేయడాన్ని కూడా బీజేపీ ఎద్దేవా చేస్తోంది. వారు అధికారం కోసమే పాకులాడుతున్నారని, తమకు బెంగాల్ ప్రజల భవిష్యత్తే ముఖ్యమని చెబుతోంది. ఇక దీదీ పాలనను మహా జంగిల్‌రాజ్‌గా అభివర్ణించిన మోడీ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, అమిత్ షా వ్యూహాలతో ఈసారి టీఎంసీకి షాక్ ఇస్తామని బీజేపీ నమ్మకంగా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీకి నేతలు చెబుతున్న స్థాయిలోసానుకూలత లేదని టీఎంసీ గాలి తీసేస్తోంది. అయితే ఎవరేం చెప్పినా.. బెంగాల్లో బీజేపీ బలం పెరుగుతున్న మాట నిజం. మమత ఓడిపోకపోయినా.. గెలవటానికి కష్టపడాల్సిన పరిస్థితి తమ ఘనతే అని బీజేపీ చెప్పుకుంటోంది. ఈసారి బీజేపీ వంద సీట్లు దాటుతుందని కొన్ని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. అదే జరిగితే మమతకు అధికారం దక్కినా.. కష్టాలు తప్పవనే అంచనాలు కూడా లేకపోలేదు.
మొత్తం మీద బెంగాల్ ఎన్నికలు మమతకు, బీజేపీకి పరువు, ప్రతిష్ఠకు సవాల్‌గా మారాయి. ఈ రెండు పార్టీల వ్యూహప్రతివ్యూహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అందరూ అనుకున్నట్టుగా ఓ పార్టీకి సవాల్‌గా మారిన అంశమే.. మరో పార్టీని కూడా ఎంతోకొంత దెబ్బ కొడుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తి, ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు.. అధికార టీఎంసీతో పాటు విపక్ష బీజేపీకీ సవాలుగా మారాయి. ఈ పరిణామాలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయనుందన్న ప్రచారం నెలకొంది. ఈసారి ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీఎంసీ ఈసారి టికెట్ నిరాకరించింది. బీజేపీ, సీపీఎంలలోను అదే పరిస్థితి. కొత్త అభ్యర్థుల పట్ల అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు.. పోలింగ్ బూత్ స్థాయిలో సహకరించకపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది.
బెంగాల్లో అధికారం ఖాయమని ధీమాగా ఉన్న టీఎంసీ.. లోలోపల బీజేపీ ఏం చేస్తుందోనని భయపడుతోంది. ఇక ఈసారి పవర్లోకి వచ్చేస్తామని ఊదరగొడుతున్న బీజేపీ కూడా.. లోపాయికారీగా మమత బలాలు చూసి కలవరపడుతోంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులతో పాటు మిగతా పక్షాలు ఎవరి ఓట్లు చీల్చుతాయి.. ఎవరి పుట్టి ముంచుతాయనేవి కీలక ప్రశ్నలుగా మిగిలాయి.
బెంగాల్‌లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ మధ్యే ఉన్నా.. కాంగ్రెస్ ఒంటరి పోరు ఎవరి పుట్టి ముంచుతుందనేది తేలాల్సి ఉంది. అలాగే ఎంఐఎం వ్యూహాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఎంఐఎం మిత్రపక్షం స్టింగ్ ఆపరేషన్ వీడియో కలకలం రేపుతోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో.. రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధ్యక్షుడు హుమాయున్ కబీర్ కు సంబంధించిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఆయన పార్టీతో ఉన్న పొత్తును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన ఈ వీడియోలో హుమాయున్ కబీర్ విస్తుపోయే వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ నుంచి తనకు రూ.1,000 కోట్లు ఆఫర్ వచ్చిందని, ఇప్పటికే రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా అందాయని ఆయన పేర్కొన్నట్లు వీడియోలో ఉంది. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు తాను సువేందు అధికారి, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ వంటి నేతలతో టచ్‌లో ఉన్నానని ఆయన చెప్పినట్లుగా ఉంది. ఇక ముస్లింలను మోసం చేయడం చాలా సులభం అని ఆయన అన్నట్లుగా వీడియోలో ఉన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటకు రాగానే ఎంఐఎం స్పందించింది. ముస్లింల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారితో కలిసి పనిచేయలేమని ఒవైసీ పార్టీ స్పష్టం చేసింది. హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయి. బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఇకపై ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఎంఐఎం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ఆరోపణలను హుమాయున్ కబీర్ తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ వీడియో అని ఆయన వాదిస్తున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీఎంసీ నేతలు ఈ కుట్ర పన్నారని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.
స్టింగ్ ఆపరేషన్ వీడియోను కబీర్ ఖండించినప్పటికీ నష్టం జరిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇప్పటికే ఎంఐఎంని పావుగా వాడుకుని మైనార్టీ ఓట్ల చీలికతో లబ్ధి పొందాలనేది బీజేపీ లక్ష్యమని మమత ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడామె ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా టీఎంసీ ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో విడుదల చేసిందని టీఎంసీ ప్రత్యర్థులు వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో మైనార్టీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఐఎంకు బెంగాల్ ముస్లిం ఓటర్లు దూరం జరుగుతారనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే మైనార్టీ ఓట్లన్నీ గంపగుత్తగా మమతకు పడటం ఖాయమే. దీనికి విరుగుడుగా హిందూ ఓటర్లు సంఘటితమై తమకు ఓటేస్తారనేది కాషాయ పార్టీ అంచనా. ఇప్పటికే ఆ పార్టీ హిందూ ఓట్లు సంఘటితం చేయడంపై దృష్టి పెట్టి.. కొంత మేర ఫలితం సాధించింది.
గత ఎన్నికల్లో బెంగాల్లో పొత్తు పెట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్, టీఎంసీ.. ఈసారి కూడా విడివిడిగానే బరిలో ఉన్నాయి. బెంగాల్‌లో తన బలానికి తగ్గట్టుగా కాంగ్రెస్ సీట్లు అడగాలని దీదీ.. తమను అవమానించే ప్రతిపాదనలు పెడుతున్నారని హస్తం పార్టీ పరస్పరం భీష్మించడంతో.. పొత్తు క్లిష్టంగా మారి.. చివరకు తెగిపోయింది. అయితే ఈసారి పొత్తు కుదరని విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మమత వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా తన బలమేంటో చాటుకోవాలనే పట్టుదలతో ప్రచారం చేస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య అసలేం జరిగిందో వాటితోనే చెప్పించాలనే ప్లాన్‌తో కవ్విస్తోంది. ప్రస్తుతానికి టీఎంసీ, కాంగ్రెస్ బయటపడకపోయినా.. పోలింగ్ నాటికి ఏదో పార్టీ నోరు జారకపోతుందా అని బీజేపీ వెయిట్ చేస్తోంది.
మొన్నటిదాకా బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎంది కీలక పాత్ర అని రాజకీయ వర్గాల అంచనా. గతంలో బీహార్ ఎన్నికల్లో బీజేపీకి పరోక్ష సాయం చేసిన అసద్ పార్టీ.. వంగభూమిలోనే అదే చేస్తుందనే విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ అనూహ్యంగా బయటపడ్డ స్టింగ్ ఆపరేషన్ వీడియోతో ఆ అంచనాలు రివర్స్ అయ్యాయని అంటున్నారు. కానీ ఇప్పటికీ బెంగాల్ ఓటర్ల మనసులో ఏముందో ఏ పార్టీ కూడా సరిగా అంచనా వేయలేకపోతున్న మాట వాస్తవం. సర్వేలు కూడా రకరకాలుగా ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకానీ ఒకే పార్టీకి మొగ్గుంటుందనే అంచనాలు రావడం లేదు. పైగా హోరాహోరీ పోరు తప్పదనే సర్వేలు అన్ని పార్టీలకూ టెన్షన్ తెప్పిస్తున్నాయి. టఫ్ ఫైట్ ఉన్నప్పుడు వందలు, పదుల ఓట్లు కూడా ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉంది. అన్నింటికీ తెగించి పోరాడుతున్న టీఎంసీ, బీజేపీ ఓటర్లను పోలరైజ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి. ఇతర పార్టీలకు ఓటేస్తే ఓటు వృథా అవుతుందనే వాదన కూడా తెరపైకి వస్తుందనడంలో సందేహం లేదు.
బెంగాల్ ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించాయి. ఈసారి బెంగాల్ గెలిస్తే.. తర్వాత ఢిల్లీపై ఫోకస్ పెడతామని దీదీ హెచ్చరించారు. దీంతో మమతను బెంగాల్‌లోనే నిలువరించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ ఆ పార్టీ పప్పులు బెంగాల్లో ఉడికేది లేదని, తమ నేత భవిష్యత్తులో ప్రధాని అవుతారని టీఎంసీ శ్రేణులు తొడ కొడుతున్నాయి. ఏతావాతా బెంగాల్ ఎన్నికల్లో స్థానిక అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతిమంగా బెంగాలీలు వేటికి కనెక్ట్ అవుతారు.. ఏ పార్టీని ఆదరిస్తారనేది తేలాల్సి ఉంది.