
రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేసవి దృష్ట్యా ఎండలు మండిపోతున్న క్రమంలో మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ సరుకుల కోటాను ఈ నెలలోనే లబ్దిదారులకు అందించనుంది. దీంతో మూడు నెలల కోటాను రేషన్‌కార్డుదారులు ఒకేసారి తీసుకోవచ్చు. అయితే మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందిస్తుండటంతో లబ్దిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. రేషన్ అయిపోతుందేమోననే భయంతో అందరూ ఒకేసారి షాప్ వద్దకు వస్తుండటంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది.
సర్వర్లపై ఒత్తిడి
రేషన్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో తొక్కుకుంటున్నారు. గ్రామాల్లో కూలీ పనులు మానుకుని మరీ రేషన్ షాపుల వద్ద గంటల పాటు వేచి ఉంటున్నారు. ఇప్పుడు రేషన్ తీసుకోకపోతే మరో మూడు నెలల వరకు రాదనే ఆందోళనతో షాపులకు పరుగులు తీస్తున్నారు. దీనిని గమనించిన పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీకి సిద్దమైంది. సాధారణంగా నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తారు. కానీ మూడు నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండటంతో మరింత సమయం ఇవ్వనున్నారు. అయితే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ మొదలవ్వడంతో సర్వర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ పోస్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రేషన్ సరుకుల పంపిణీ ఆలస్యమవుతోంది. వృద్దులు, మహిళలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి ఉండలేక అవస్థలు పడుతున్నారు.
త్వరలోనే సర్వర్ సమస్కకు పరిష్కారం
పౌరసరఫరాల శాఖ సర్వర్ సమస్యపై స్పందించింది. త్వరలోనే సర్వర్ ఇష్యూను పరిష్కరిస్తామని తెలిపింది. రేషన్ సరుకుల కోసం ప్రజలు ఒకేసారి గుమికూడవద్దని సూచించింది. ఇక రేషన్ సరుకుల స్టాక్ లేదని, అందుకే పంపిణీ ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందిస్తూ.. రేషన్ సరుకుల స్టాక్ తగినంత స్థాయిలో అందుబాటులో ఉండదని, బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఎప్పటికప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ పంపిణీ జరుగుతుందని తెలిపింది. రేషన్ షాపుల వద్ద ఎక్కువ స్టాక్ భద్రపర్చుకోవడానికి తగినంత స్థలం ఉండదు. దీంతో పౌరసరఫరాల శాఖ డీలర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తోంది.