Reading Time: < 1 minute

వికారాబాద్ జిల్లాలో అమానుషం.. అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త

Caption of Image.

వికారాబాద్, వెలుగు: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కర్రతో కొట్టి, డ్రిప్  పైప్​తో వాతలు పెట్టి హత్య చేశాడు. మర్పల్లి ఎస్సై అబ్దుల్​ రౌఫ్​ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్​ జిల్లా బొంరాస్​పేట మండలం బురాన్​పల్లి గ్రామానికి చెందిన నర్మద(27)తో బంట్వారం మండల కేంద్రానికి చెందిన మంగలి రవీందర్​కు 2018లో వివాహమైంది. వారికి కొడుకు, కూతురు ఉన్నారు. కొద్ది రోజుల తరువాత రవీందర్​ మద్యానికి బానిసై నర్మదను తిడుతూ కొట్టేవాడు. గొడవ జరిగినప్పుడల్లా నర్మద తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది. ప్రతిసారి పుట్టింటికి ఎందుకు వెళ్తావని​రవీందర్​ ప్రశ్నించగా, అక్కడ వేరే వ్యక్తితో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పింది.

ఈ క్రమంలో మంగళవారం రవీందర్​ ఎవరితో వివాహేతర సంబంధం ఉందో చెప్పు లేదంటే చంపేస్తానని నర్మదను కట్టెతో తీవ్రంగా కొట్టాడు. డ్రిప్​ పైప్​ను వేడి చేసి ముఖం, తొడలు, కడుపుపై కాల్చాడు. శనివారం నర్మద భోజనం చేయలేక నీరసంగా ఉండడంతో భోజనం చేయమని మెడలు పట్టుకుని తోశాడు. ఆ తరువాత నర్మద వాంతులు చేసుకోవడంతో మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు శశిగోపాల్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.