Reading Time: 2 minutes
Andhra: ఖాకీచకుడు.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే నీచపు పనులు..

ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేస్తాడు.. ఆటో డ్రైవర్‌తో వారి వీడియోలు తీయిస్తాడు. ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు. ఇవన్నీ ఎవరో ఒక క్రిమినల్ చేసే పనులు కాదు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ చేసే వికృతక్రీడలు ఇవన్నీ… ఇవే కాదు మైనర్ బాలికను వేధించడం, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి ఘటనలు వెలుగు చూడటం ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఒక్కసారిగా కలకలం రేపింది.. గుంటూరుకు చెందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు రాసలీలు, క్రైమ్ కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

గుంటూరుకు చెందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రస్తుతం మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మాచర్ల పర్యటక ప్రాంతం కావడంతో అక్కడకు వచ్చే జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో వారి వీడియోలు తీయించేవాడు. రాత్రి సయమంలో గస్తీ పేరుతో తిరుగుతూ ఒంటరిగా కనిపించిన వాళ్లని కూడా టార్గెట్ చేసేవాడు. వాళ్లని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసేవాడు. అయితే ఆటో డ్రైవర్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మాచర్లలో ఒక మహిళతో సన్నిహితంగా ఉండే శ్రీనివాసరావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో యూనిఫారంలో ఉండగా.. ఏకాంతంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో రావడంతో ఏఎస్ఐ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏఎస్ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

శ్రీనివాసరావు ఏ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఇదే తరహాలో వ్యవహరించేవాడన్న ఆరోపణలున్నాయి. 2024లో క్రోసూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు సమీప బంధువైన మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నువ్వు లాడ్జిలో కనిపించినట్లు, ఎవరితోనూ బస్సు ఎక్కుతున్నట్లు చూశానని బంధవులతో చెబుతానని బాలికను బెదిరించాడు. అర్థరాత్రుల్లో ఆ బాలికకు ఫోన్ కూడా చేసేవాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై ఫోక్సో కేసు నమోదైంది. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అతను గురజాలలో విధులు నిర్వహిస్తుండగా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వారంతా కలిసి అతనికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దీ రోజుల తర్వాత మాచర్లకు బదిలీ అయ్యాడు. అక్కడ కూడా ఏకాంతంగా ఉన్న జంటలను బెదిరిస్తూ తీసిన వీడియోలు కలకలం రేపాయి.

దీంతో ఏఎస్ఐ ను మరోసారి సస్పెండ్ చేశారు. వివాదాలకు కారణమైన ఏఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..