
మెదక్, వెలుగు: మెదక్ పట్టణ శివారులోని పసుపు లేటి వాగు(హరిద్రా నది)లో పాత రాతియుగం నుంచి కొత్త రాతియుగం వరకు వినియోగించిన రాతి పనిముట్లను, ఆంత్రోపొమార్ఫిక్ శిలలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు మచ్చ ప్రణయ్ కుమార్ తెలిపారు. ఈ ఆంత్రోపొమార్ఫిక్ శిల గతంలో సిద్ధిపేట జిల్లా పుల్లూరులో నిర్వహించిన మెగాలిథిక్ తవ్వకాలలో వెలుగు చూసిన రాతికడ్డీ అమ్మదేవతను పోలి ఉందని తెలిపారు.
దేశంలోనే అరుదైన ఈ రాతికడ్డీ మాతృదేవతకు ప్రతిబింబం మాదిరిగా పసుపులేటి అమ్మదేవత నీటిలో దొరలి కొంతభాగం అరిగిపోయిందన్నారు. కానీ, రూపం కోల్పోలేదని చెప్పారు. 11సెంటీ మీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల మందంతో ఉన్న నలుపలకల రాతిబొమ్మ ఈ అమ్మదేవత అని పేర్కొన్నారు. పుల్లూరు అమ్మదేవత మాదిరిగానే మెదక్ పసుపులేటిలో లభ్యమైన అమ్మదేవత 4, 5 వేల ఏండ్ల కిందటిదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.