
వాషింగ్టన్: అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలం అవ్వడంతో అమెరికా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అని ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇరాన్ నౌకలను దిగ్భందించే అవకాశం ఉన్నట్లు ఓ మీడియా కథనాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇరాన్‌పై తదుపరి ప్రణాళికల గురించి ట్రంప్ పరోక్షంగా హింట్‌ఇచ్చారా అని అంతర్జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది.
ట్రంప్ షేర్ చేసిన వార్తా కథనంలో హార్మూజ్ జలసంధిపై నౌకాదళ నిర్బంధాన్ని అమలు చేయాలని కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అమెరికా డిమాండ్లకు లొంగకపోతే అధ్యక్షుడి వద్ద ఉన్న అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే.. హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే నౌకలను అడ్డుకునేందుకు అమెరికా నౌకాదళం వెంటనే చర్యలు ప్రారంభిస్తుంది. అప్పుడు చమురు ఎగుమతులపై ఆధారపడిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది. టెహ్రాన్ నుండి చమురు దిగుమతి చేసుకుంటున్న దాని మిత్ర దేశాలైన చైనా, భారత్‌పైనా ఈ ప్రభావం పడుతుంది. వెనెజులా మాజీ అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భందించడానికి ముందు కూడా ఇదే విధంగా ఆ దేశంలోని నౌకలను దిగ్భందించారు. ఆ విజయవంతమైన ప్లాన్‌ను ట్రంప్ ఇరాన్‌పైనా అమలు చేసే అవకాశం ఉంది అని మీడియా సంస్థ అంచనా వేసింది.
ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం రవాణా జరిగే ఈ కీలక జలమార్గంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించడం ద్వారా, యుద్ధంలో ఇరాన్‌కు ఉన్న ఆర్థిక ఆధిక్యాన్ని తగ్గించడమే అమెరికా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు టోల్ చెల్లించిన ప్రతి నౌకను గుర్తించి అడ్డుకోవాలని మా నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చాను. చట్టవిరుద్ధంగా టోల్ చెల్లించే వారికి సముద్ర మార్గంలో సురక్షిత ప్రయాణం ఉండదు అని ట్రంప్ హెచ్చరించారు. ఇక అవసరమైతే సరైన సమయంలో ఇరాన్‌పై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగియకపోవడానికి ఇరాన్ అణు ఆశయాలే ప్రధాన కారణమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో జరిగిన అమెరికాఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.