
- రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై బండరాయితో దాడి
- కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యేవరకూ కొట్టి.. డ్రైనేజీ పక్కన పడేసి..
- తర్వాత ఇన్‌స్టాగ్రాంలో రీల్.. వరంగల్‌లో దారుణం
- మార్చి 17న ఘటన.. తాజాగా పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకి..
వరంగల్, వెలుగు: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం గంజాయి బ్యాచ్ అరాచకం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిపై గంజాయి తాగిన యువకులు పాశవికంగా దాడి చేశారు. నలుగురు వ్యక్తులు కలిసి అతడిని కర్రలతో కొడుతూ, కాళ్లు నుజ్జునుజ్జయ్యేంత వరకు బండరాయితో బాదారు. ఆ ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. గ్రేటర్ వరంగల్‌లోని గాంధీనగర్‌లో గత నెల 17న జరిగిన ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. గాంధీనగర్‌కు చెందిన పగిండ్ల నరేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు గత నెల17న రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ టైంలో అదే ప్రాంతానికి చెందిన పసునూరి కల్యాణ్‌తోపాటు మరో ముగ్గురు యువకులు బైక్‌ల మీద వచ్చి వెనుక నుంచి నరేశ్‌ను ఢీకొట్టారు. నరేశ్ కింద పడిపోవడంతో అతడిని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి లాక్కెళ్లారు. తర్వాత నలుగురు కలిసి నరేశ్‌పై కర్రలతో దాడి చేయడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. అక్కడితో ఆగకుండా.. పెద్ద బండరాయిని నరేశ్ కాళ్లపై పదే పదే పడేస్తూ నుజ్జునుజ్జయ్యే వరకు దాడి చేశారు. ఈ దృశ్యాన్నంతటినీ సెల్‍ఫోన్‍లో వీడియో తీశారు. నరేశ్ సృహ తప్పడంతో చనిపోయాడని భావించి దగ్గర్లోని ఓ డ్రైనేజీ వద్ద పడేసి వెళ్లారు. తెల్లారిన తర్వాత అటువైపు వెళ్తున్న స్థానికులు గమనించి నరేశ్‌ను అతడి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నరేశ్ భార్య పుట్టింట్లో ఉండడంతో మార్చిన 21న అతడి సోదరి జ్యోతికి విషయం తెలిసింది. దీంతో ఆమె నరేశ్ ఇంటికి చేరుకొని అతడిని ఎంజీఎం హాస్పిటల్‌లో చేర్పించింది. అప్పటి నుంచి నరేశ్‌కు ట్రీట్‍మెంట్ కొనసాగుతున్నది. నరేశ్ సోదరి జ్యోతి శుక్రవారం మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. ఇదిలా ఉండగా.. నరేశ్‌పై దాడి చేస్తున్న టైంలో నిందితులు తీసిన వీడియోను వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
25 రోజుల తర్వాత కేసు
వరంగల్ నగరంలో గడిచిన కొన్ని రోజులుగా నిత్యం గాంజా, మద్యం బ్యాచ్ రోడ్లపై దాడులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నది. వారిపై చర్యల విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తుండగా.. ప్రస్తుతం గాంధీనగర్‍లో నరేశ్ జరిగిన దాడి ఘటనలోనూ స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మార్చి 17న భయానక స్థితిలో దాడి జరిగి బాధితుడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే.. పోలీసులు మాత్రం తమకు 25 రోజుల తర్వాత ఏప్రిల్ 10న ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేశామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కాళ్లు నుజ్జు నుజ్జయిన క్రమంలో బాధితులు చికిత్స కోసం వచ్చే క్రమంలో ఎంజీఎం అధికారులు దానిని మెడికల్ లీగల్ కేసుగా (ఎంఎల్‍సీ) పరిగణించి.. స్థానిక పోలీస్ స్టేషన్ ఆఫీసర్లకు అధికారికంగా సమాచారం అందిస్తారు. దానిని అతడి హాస్పిటల్ కేసు షీట్ రికార్డులో నమోదు చేస్తారు. అలాకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లో దాడులకు సంబంధించిన సమాచారం లేదంటే ఫిర్యాదు ఉంటే మాత్రమే అలా జరగదు. కాగా, నరేశ్ విషయంలో కాళ్లు నుజ్జునుజ్జయి రక్తపు మడుగులో చికిత్స కోసం రాగా.. హాస్పిటల్ అధికారులు మాత్రం ఎంఎల్‍సీగా నమోదు చేయకుండానే ఇన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఈ లెక్కన నరేశ్‌పై దాడి ఘటన మిల్స్ కాలనీ పోలీసులకు ఎప్పుడో సమాచారం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలో వరుసగా ఐదారు ఘటనలు జరగడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అసలు సమాచారాన్ని దాచి శుక్రవారం బాధితుల నుంచి ఫిర్యాదు అందినట్లు కేసు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టేషన్ పరిధిపై క్లారిటీ లేదు
నరేశ్‌పై దాడి జరిగిన విషయం గడిచిన 25 రోజులుగా మా నోటీసులో లేదు. దాడి జరిగిన ప్రదేశం మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోకి వస్తుందా? లేదా ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా? అనే దానిపై క్లారిటీ లేదు. దాడి ఏ ప్రాంతంలో చేశారో బాధితుడు చెబితేనే ఈ కేసు ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే దానిపై స్పష్టత వస్తుంది. నరేశ్ సోదరి జ్యోతి శుక్రవారం రాత్రి ఫిర్యాదు ఇచ్చినందున మా వంతుగా మొదటగా కేసు నమోదు చేశాం.
– రమేశ్, సీఐ, మిల్స్ కాలనీ