Reading Time: 2 minutes

 రహస్య కోటి రూపాయలు

స్వాహా ఇద్దరు అధికారుల

చేతివాటం ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో

పాతుకుపోయిన అధికారులు,

సిబ్బందితో వసూళ్ల దందా

మేడ్చల్ పరిధిలో కిందిస్థాయి

సిబ్బందికి ఓ అధికారి టార్గెట్ పెట్టి

వసూళ్లు సికింద్రాబాద్‌లో డిఫెన్స్

బాటిళ్లను విక్రయిస్తున్న ఎక్సైజ్

అధికారి గంజాయి సేవిస్తూ

దొరికిన ఓ కంపెనీ యజమాని

మనవడు, రూ. 20 లక్షలు

పుచ్చుకొని వదిలేసిన వైనం

మనతెలంగాణ/హైదరాబాద్: ఆబ్కారీ శాఖలో అవినీతి తిమింగలాలు అధికమయ్యారు. గంజాయి, ఎండిఎం, డ్రగ్స్, నకిలీ మద్యం కేసుల్లో అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో పనిచేసే కొందరు అధికారుల చేతివాటం అధికమయ్యిందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. ముఖ్యంగా ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో కిందిస్థాయి సిబ్బంది ద్వారానే ఈ వసూళ్ల దందా జరుగుతుందని అందుకే తమకు నచ్చిన కానిస్టేబుళ్లను డిప్యూటేషన్ తీసుకొచ్చి ఇక్కడ అక్రమాలు, అవినీతి కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో…

ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఇన్‌ఫార్మర్‌ల పేరుతో ఏర్పాటు చేసే సీక్రెట్ ఫండ్‌కు సంబంధించి కోటి రూపాయలను ఇద్దరు అధికారులు కలిసి స్వాహా చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో ఇన్‌ఫార్మర్‌ల పేరుతో ఆ డబ్బును ఇద్దరు అధికారులు స్వాహా చేశారని ఇప్పటికే దీనిపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు అందినట్టుగా సమాచారం. ఇలా, ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో చాలాకాలంగా కొందరు అధికారులు, సిబ్బంది డిప్యూటేషన్‌ల పేరుతో పాతుకు పోయారని వారే ప్రస్తుతం చక్రం తిప్పుతూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.20 లక్షలు ఇచ్చి మనువడిని తీసుకెళ్లిన…

ఈ మధ్య ఎస్‌టిఎఫ్‌లో పనిచేసే ఓ అధికారి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఆయన మనువడిని అరెస్టు చేస్తానని బెదిరించి గంటలోనే వారి నుంచి రూ.20 లక్షలను వసూళ్లు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. గంజాయి కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సమయంలో ఆ వ్యక్తి ఫోన్‌ను ఎస్‌టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను చెక్ చేయగా ప్రముఖ కంపెనీకి చెందిన మనువడు గంజాయి తీసుకుంటున్న వీడియో ఎస్‌టిఎఫ్ అధికారులకు దొరికింది. వెంటనే ఎస్‌టిఎఫ్ అధికారులు ప్రముఖ కంపెనీకి చెందిన మనువడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆ కంపెనీ యజమాని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తన మనువడిని ఎస్‌టిఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయమై మొరపెట్టుకోగా ఆ ఎమ్మెల్యే వెంటనే ఎస్‌టిఎఫ్ అధికారితో సంప్రదింపులు జరిపారని, ఆ అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో గంటలోపే ప్రముఖ కంపెనీ యజమాని రూ.20 లక్షలు ఇచ్చి ఆయన మనువడిని ఇంటికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది.

మేడ్చల్ పరిధిలో పనిచేసే…

మేడ్చల్ పరిధిలో పనిచేసే ఒక అధికారి కూడా వసూళ్లలో కింగ్‌మేకర్ అయ్యారని గతంలో ఆయన పనిచేసిన జిల్లాలోనూ అనేక ఆరోపణలు వచ్చాయని ప్రస్తుతం కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్ పెట్టి ఆయన వసూళ్లు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో పనిచేసే ఇద్దరు ఎక్సైజ్ సిఐలకు రెగ్యులర్‌గా ఇచ్చే మాముళ్లు సరిపోక వారి పరిధిలోని బార్‌లు, వైన్‌షాపులపై వేరే వారితో కేసులు నమోదు చేయించి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శంషాబాద్ పరిధిలోని డిటిఎఫ్‌లో…

సికింద్రాబాద్ పరిధిలో పనిచేసే ఒక ఎక్సైజ్ అధికారి డిఫెన్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిని ధ్వంసం చేయకుండా ఇతరులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయన్ను ఒకసారి మందలించినా ఆయనలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. శంషాబాద్ పరిధిలో డిటిఎఫ్‌లో పనిచేసే ఒక అధికారిపై భారీగా ఆరోపణలు రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘా పెట్టినట్టుగా తెలిసింది.

అధికారుల పనితీరుపై రిపోర్టు…

దీంతోపాటు ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలోని కొందరు సిఐలు, ఎస్‌ఐలు వైన్‌షాపులు, బార్ యజమానులను కేసుల పేరుతో బెదిరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఈ మధ్య ఫిర్యాదులు అందడంతో దానిపై అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్టుగా తెలిసింది. త్వరలో జరిగే బదిలీల్లో ఎస్‌ఐలు, సిఐలు, ఏఈఎస్‌లు, ఈఎస్‌లు, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌ల పనితీరు, వారి అవినీతి భాగోతాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే అంతర్గతంగా వారి రిపోర్టు సైతం ప్రిన్సిపల్ సెక్రటరీ తెప్పించుకున్నట్టుగా సమాచారం.